Taapsee Pannu: తాప్సీ.. తెలుగులో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ చేసిన ఈ హీరోయిన్‌.. ఇప్పుడు బాలీవుడ్‌లో బీజీగా మారిపోయింది. వరుస, వైవిధ్యమైన ప్రాజెక్టులు చేస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకుంది తాప్సీ. అయితే, సినిమాలే కాదు ఎన్నో సామాజిక అంశాలపై కూడా తాప్సీ ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు తీస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తుంటారు. 'తప్పడ్‌' లాంటి సామాజిక స్పృహ కల్పించే సినిమాలు చేశారు తాప్పి. కాగా.. ఇప్పుడు ఆమె చేసిన కొన్ని కామెంట్స్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. వీసా పాలసీ గురించి తాప్సీ చెప్పిన మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి అంటూ ఆమె అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.    


ధనిక,పేద మధ్య విభజన ఎందుకు? 


క్యాజువల్‌ ఇంటర్వ్యూలో భాగంగా తాప్సీ చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వీసాకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడారు. "వీసా, ఇమ్మిగ్రేషన్‌ రూల్స్‌ తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. ఎక్కువగా డబ్బులేనివారు.. చదువుకోనివారిని వీసా రూల్స్‌ ఇబ్బందికి గురిచేస్తాయి. మనసమాజంలో డబ్బున్నవారు, పేదల మధ్య విభజన మరింత పెంచుతుంది. బ్యాంకుల్లో ఎక్కువగా డబ్బు ఉన్న వారు వీసాలు పొందుతున్నారు. కానీ, తక్కువ ఆదాయం ఉన్నవారు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్య మా 'డంకీ' సినిమాను ఫారెన్‌లో షూట్‌ చేయాల్సి వచ్చింది. మా చిత్రయూనిట్‌లో కొందరు తమ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ అవసరమైన థ్రెషోల్డ్‌ కంటే తక్కువగా ఉండడం వల్ల వాళ్లు యూకే వీసా పొందేందుకు ఇబ్బందులు పడ్డారు. అంత పెద్ద ప్రాజెక్ట్‌ అయినప్పటికీ వీసా కోసం ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. ఇలాంటి రూల్స్‌ పేదవారిని ప్రభావితం చేస్తున్నాయి" అంటూ కామెంట్‌ చేశారు తాప్సీ. 


ఇక తాప్సీ ప్రస్తుతం ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ చిత్రం కోసం వర్క్‌ చేస్తున్నారు. ‘హసీనా దిల్‌రుబాకు’ సీక్వెల్‌గా వస్తోంది ఈ సినిమా. జయప్రద దేశాయ్‌ దర్శకుడు కాగా.. విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘హసీనా దిల్‌రుబా’ సినిమా గురించి మాట్లాడుతూ మొదట్లో ఆ సినిమా చేసేందుకు చాలామంది రిజక్ట్‌ చేస్తే తనను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశారని, కానీ ఆ పాత్ర చేయడం తనకు సవాలు అని చెప్పారు తాప్సీ.


ఇక 'డంకీ' సినిమా విషయానికి వస్తే.. పోయిన ఏడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ సినిమా మంచి హిట్‌ అందుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర బాగానే వసూలు చేసింది. ఒకదేశం నుంచి మరొక దేశానికి అక్రమంగా ఎలా ప్రయాణిస్తారు అనేది ‘డంకీ' సినిమాలో చూపించారు. తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించింది. విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్‌ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను తొలిసారి  స్క్రీన్‌ షేర్ చేసుకుంది ఈ సినిమాతోనే. అభిజత్ జోషి, కనికా ధిల్లాన్‌ స్క్రీన్‌ ప్లే రాశారు. రాజ్‌ కుమార్ హిరానీ ఫిల్మ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సమర్పిస్తోంది. ప్రీతమ్ సంగీతం అందించారు.


Also Read: పద్మ విభూషణ్‌కు ముందు చిరంజీవికి వచ్చిన అవార్డులు, లభించిన సత్కారాలు తెలుసా?