Bobby Deol in Kanguva: ప్రస్తుతం చాలావరకు హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెడుతున్నారు. పైగా ఈ ప్రాజెక్ట్స్ తెరకెక్కించే క్రమంలో బడ్జెట్ విషయంలో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. అలాంటి హీరోల్లో సూర్య కూడా ఒకరు. ప్రస్తుతం సూర్య ‘కంగువ’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ‘కంగువ’ నుంచి విడుదలయిన ప్రతీ గ్లింప్స్, పోస్టర్స్.. సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేశాయి. ఇందులో సూర్య.. మునుపెన్నడూ కనిపించని అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరో తాజాగా రివీల్ చేశారు మేకర్స్.


మీ ఫ్రెండ్‌షిప్‌కు థాంక్యూ..


శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంగువ’లో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు సూర్య. ఇక తనను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నట్టు మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. జనవరి 27న బాబీ డియోల్ పుట్టినరోజు కావడంతో ‘కంగువ’లో విలన్ తానే అని చెప్తూ ఒక స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో బాబీ.. ఉధిరన్ అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. హీరో సూర్య కూడా బాబీ డియోల్‌కు బర్త్ డే విషెస్ చెప్తూ.. ఈ పోస్టర్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే బాబీ డియోల్ బ్రదర్. మీ ఫ్రెండ్‌షిప్‌కు థాంక్యూ. కంగువలో గొప్ప ఉధిరన్‌లాగా కనిపించడం కోసం మీ ట్రాన్ఫార్మేషన్ అదిరిపోయింది. ప్రేక్షకులందరూ ఆయన కోసం ఎదురుచూడండి’ అనే క్యాప్షన్‌తో లుక్‌ను ట్వీట్ చేశాడు సూర్య.






క్రూరమైన విలన్..


‘కంగువ’ చిత్రాన్ని సమర్పిస్తున్న స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ హౌజ్.. ముందుగా ఉధిరన్‌గా బాబీ డియోల్ లుక్‌ను రిలీజ్ చేసింది. తన పాత్రకు ‘క్రూరమైన, శక్తివంతమైన, మర్చిపోలేని’ అని ట్యాగ్స్ కూడా ఇచ్చింది. చాలామంది అడవి మనుషుల మధ్య బాబీ డియోల్ లుక్ చాలా భయంకరంగా ఉంది. ఈ మూవీలో ఆయన పాత్రకు కంటిచూపు లోపం కూడా ఉంటుందని లుక్ ద్వారా అర్థమవుతోంది. యూవీ క్రియేషన్స్‌తో పాటు కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థలు.. ‘కంగువ’ను నిర్మిస్తున్నాయి. సూర్య సరసన హీరోయిన్‌గా దిశా పటానీ నటిస్తోంది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్.. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని అందిస్తున్నాడు.






‘యానిమల్’తో క్రేజ్..


బాబీ డియోల్.. ఇప్పటికే ‘యానిమల్’ మూవీ ఇచ్చిన కిక్‌లో ఉన్నాడు. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీలో బాబీ డియోల్ విలన్‌గా కనిపించాడు. ఈ సినిమా వల్ల రణబీర్ కపూర్‌కు ఎంత గుర్తింపు వచ్చిందో.. బాబీకి కూడా అంతే పేరు వచ్చింది. తన పాత్రకు డైలాగులు లేకపోయినా.. అతి క్రూరమైన విలన్ పాత్రలో ఒదిగిపోయాడు బాబీ డియోల్. క్లైమాక్స్ ఫైట్ సీన్‌లో ఈ నటుడి పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘యానిమల్’లో తన యాటిట్యూడ్‌ను ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా వల్ల బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా సౌత్‌లో కూడా బాబీ డియోల్ బిజీ అయిపోయాడు. ‘కంగువ’తో పాటు ఇతర సౌత్ చిత్రాల్లో కూడా విలన్‌గా నటిస్తున్నాడు.


Also Read: అందుకే దూరంగా ఉంటున్నాం - సూర్యతో విడాకులపై స్పందించిన జ్యోతిక