Swathi Reddy: పెళ్లి, విడాకుల విషయంలో సినీ సెలబ్రిటీలకు అస్సలు ప్రైవసీ అనేది ఉండదు. ఒక సినీ సెలబ్రిటీ పెళ్లయిన కొన్నాళ్లకే సందర్భం ఉన్నా, లేకపోయినా వాళ్లు విడాకులు తీసుకుంటున్నారంటూ రూమర్స్ రావడం మొదలవుతుంది. తెలుగమ్మాయి ‘కలర్స్’ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. వాటికి స్వాతి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇచ్చింది. ప్రస్తుతం తన పని తను చేసుకుంటూ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండడం లేదు స్వాతి. అలాంటి తనపై ఒక నెటిజన్ దారుణమైన కామెంట్ చేశాడు. కానీ స్వాతి మాత్రం దీనిని చాలా ఫన్నీగా తీసుకుంది.
నెగిటివ్ కామెంట్స్..
ఎయిర్ లైన్స్‌లో పనిచేసే పైలెట్ వికాస్‌తో స్వాతి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేకుండా ఫారిన్‌లో వెళ్లి సెటిల్ అయిపోయింది ఈ భామ. ఏమైందో తెలియదు మళ్లీ ఇండియాకు తిరిగొచ్చేసి.. తన సినీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా తనకు విడాకుల గురించి ప్రశ్న ఎదురవ్వగా దానికి స్వాతి ఇచ్చిన ‘నేను చెప్పా’ అనే ఆన్సర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది కూడా. అంత క్లారిటీగా చెప్పను అన్న తర్వాత కూడా కొందరు నెటిజన్లు.. తనపై నెగిటివ్ కామెంట్స్ చేయడం ఆపడం లేదు.
పాజిటివ్ రిప్లై..
స్వాతి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను షేర్ చేసింది. దానికి ఒక నెటిజన్ రిప్లై ఇస్తూ ‘ఛీ నీ బ్రతుకు’ అంటూ స్వాతికి పర్సనల్ మెసేజ్ చేశారు. ఆ పర్సనల్ మెసేజ్‌ను పబ్లిక్‌గా పోస్ట్ చేసింది స్వాతి. అంతే కాకుండా ‘‘నేను కూడా కొన్నిసార్లు అలాగే ఫీలవుతా’’ అంటూ నవ్వుతున్న ఎమోజీ పెట్టింది. దాంతో పాటు ‘‘అప్పుడే నాకు గుర్తొచ్చి ముందుకు వెళ్తాను. థాంక్యూ నా బుజ్జి బ్రతుకు’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది స్వాతి. తనపై అంత నెగిటివ్‌గా కామెంట్ చేసినా స్వాతి మాత్రం చాలా పాజిటివ్‌గా తీసుకుంది అంటూ తన రిప్లైను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కొందరు చేసే పనులకు స్వాతి పర్ఫెక్ట్‌గా రిప్లై ఇస్తుంది అంటూ చర్చించుకుంటున్నారు.
పక్కింటమ్మాయి పాత్రల్లో..
‘కలర్స్’ అనే ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన స్వాతి.. దాని ద్వారానే వెండితెరపై కూడా అడుగుపెట్టింది. బ్యాక్ టు బ్యాక్ అటు తమిళంలో, ఇటు తెలుగులో హీరోయిన్‌గా ఛాన్సులు కొట్టేసింది. మన పక్కింటమ్మాయే అనిపించే పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది. మెల్లగా తెలుగుకంటే తమిళంలోనే తనకు ఎక్కువగా అవకాశాలు, గుర్తింపు రావడం మొదలయ్యింది. చేసిన సినిమాలు తక్కువే అయినా తనకంటూ ఇండస్ట్రీలో ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది స్వాతి. ప్రస్తుతం ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ‘టీచర్’ అనే ఫీల్ గుడ్ మూవీలో డిఫరెంట్ రోల్‌లో కనిపించడానికి స్వాతి సిద్ధమయ్యింది.
Also Read: ఓటీటీకి వచ్చేస్తోన్న అదా శర్మ మరో వివాదస్పద మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!