SV Krishna Reddy about Rajendra Prasad: ఒకప్పుడు తెలుగులో మినిమమ్ గ్యారెంటీ హిట్లు అందుకున్న సినిమాలు అన్నీ ఫ్యామిలీ జోనర్‌కు చెందినవే. అలా చాలామంది ప్రేక్షకులకు నచ్చే ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించిన దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఒకరు. ఆయన ప్రతీ సినిమాను థియేటర్లలో మిస్ అవ్వకుండా ఫాలో అయిన ఫ్యామిలీ ఆడియన్స్ చాలామందే ఉన్నారు. అలాంటి ఎస్వీ కృష్ణారెడ్డిని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా నిలబెట్టిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ‘మాయలోడు’. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ హీరో అయినా కూడా కమెడియన్‌గా నటించిన బాబూమోహన్‌, సౌందర్యతో డ్యూయెట్ సాంగ్ తెరకెక్కించారు ఎస్వీ. అసలు అలా చేయడం వెనుక కారణమేంటో తాజాగా బయటపెట్టారు.


‘మాయలోడు’ సమయంలో సమస్యలు..


‘మాయలోడు’ మూవీలో బాబూమోహన్, సౌందర్య మధ్య డ్యూయెట్‌గా తెరకెక్కిన ‘చినుకు చినుకు’ పాటకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆరోజుల్లో బాబూమోహన్‌లాంటి కమెడియన్‌తో డ్యూయెట్ చేయించిన మొదటి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. అయితే హీరోగా నటించిన రాజేంద్ర ప్రసాద్‌ను కాదని, బాబూమోహన్‌తో ‘చినుకు చినుకు’ పాటకు స్టెప్పులు వేయించడానికి అసలు కారణమేంటో ఎస్వీ తాజాగా బయటపెట్టారు. ‘మాయలోడు’ సినిమా షూటింగ్ సమయంలో రాజేంద్ర ప్రసాద్.. తనను బాగా ఇబ్బంది పెట్టడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది అనే సమయంలో హీరో తనను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారని ఎస్వీ అన్నారు.


వెటకారంగా మాట్లాడారు..


‘‘నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా, నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా’’ అని రాజేంద్ర ప్రసాద్ వెటకారంగా మాట్లాడేవారని ఎస్వీ కృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు. దాని వల్ల ఆయన చాలా బాధపడేవారని అన్నారు. ‘మాయలోడు’ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది అనుకున్న సమయంలోనే హీరో డేట్స్ తక్కువ అయ్యాయని, అదనపు డేట్స్ కావాలని అడగగా కనీసం సహకరించలేదని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు ఈ సీనియర్ డైరెక్టర్. ఎలాగైనా ‘చినుకు చినుకు’ పాటను షూట్ చేయాలని ఎంత అడిగినా కూడా రాజేంద్ర ప్రసాద్ పట్టించుకోలేదని తెలిపారు. ఇంకా తమ దగ్గర రాజేంద్ర ప్రసాద్‌కు సంబంధించిన కొన్ని డేట్స్ మాత్రమే మిగిలి ఉండడంతో వాటితో డబ్బింగ్ పూర్తి చేయించానని ఎస్వీ అన్నారు. ఆ డబ్బింగ్ సమయంలో కూడా ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.


బాబూమోహన్‌కు మాటిచ్చాను..


‘మాయలోడు’ సినిమా మొత్తం 1200 అడుగుల రీల్ వస్తే.. ఎడిటర్‌ను రిక్వెస్ట్ చేసి మరీ దానిని ఒక రీల్‌గా మార్చారట ఎస్వీ కృష్ణారెడ్డి. ఆ విషయం రాజేంద్ర ప్రసాద్‌కు తెలియదని, మధ్యాహ్నం లోపు డబ్బింగ్ పూర్తవ్వడంతో ఆయన ఆశ్చర్యపోయారని గుర్తుచేసుకున్నారు. ‘‘ఇంకా పాట చేయాలి కదా ఎలా చేస్తావో చూస్తా’’ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారట రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత పాట షూటింగ్‌కు రమ్మని పిలిచినప్పుడు ‘‘నాకు కుదరదయ్య, సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావు కదా చేసుకోపో’’ అని దురుసుగా ప్రవర్తించారని బయటపెట్టారు. దీంతో బాబూమోహన్‌ను పాట చేయడానికి ఒప్పించారట ఎస్వీ.


ఆ సమయంలో మధ్యవర్తులను పంపించి.. తాను పాట చేయడానికి సిద్ధమే అని హింట్ ఇచ్చారట రాజేంద్ర ప్రసాద్. ‘‘బాబూమోహన్‌కు మాటిచ్చాను. కావాలంటే రాజేంద్ర ప్రసాద్ షూటింగ్ స్పాట్‌కు రావచ్చు, చూసి వెళ్లొచ్చు’’ అని వారిని పంపించేశారట ఎస్వీ. రాజేంద్ర ప్రసాద్, ఎస్వీ‌లది హిట్ కాంబినేషన్. ఎస్వీ కృష్ణారెడ్డికి కూడా రాజేంద్ర ప్రసాద్‌పై ప్రత్యేక అభిమానం ఉందని పలుమార్లు బయటపెట్టారు. కానీ ‘మాయలోడు’ షూటింగ్ సమయంలో మాత్రమే అలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని ఈ దర్శకుడు తెలిపారు.


Also Read: ప్రభాస్ 'కల్కి' సినిమాలో మరో హీరోయిన్?