SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా థియేటర్లకు వస్తారు అని ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు.. నటుడిగా పలు చిత్రాల్లో నటించారు ఎస్వీ. ముందుగా ‘కిరాతకుడు’ అనే సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. చిరంజీవి హీరోగా నటించిన ‘కిరాతకుడు’లో నటించడం కోసం ఎస్వీ కృష్ణారెడ్డి ఎన్నో అవమానాలు ఎదుర్కున్నానని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టారు.


అలా నన్ను ఫిక్స్ చేశారు..


‘‘అప్పట్లో నేను సత్యమూర్తి ఆఫీస్‌లోనే ఒక చిన్న చాప వేసుకొని పడుకునేవాడిని. నీకు వచ్చే ఆదాయంతోనే గడుపు అని చెప్తూండేవారు. అలాగే ఉండేవాడిని. ఎక్కడా అప్పు చేసేవాడిని కాదు. తప్పు చేసేవాడిని కాదు. ‘కిరాతకుడు’ షూటింగ్ టైమ్‌లో సత్యమూర్తి వెళ్లి నా గురించి చెప్తే.. ఆయనేం పనికొస్తాడు ఆయనేం పనికిరాడు, వద్దు అని కోదండ రామిరెడ్డి చెప్పేశారు. ఆ విషయం నాకు వచ్చి చెప్పగానే నాలో ఒక తెలియని ఆవేశం బాగా పెరిగిపోయింది. అది బయటికి కనిపించకుండా కొన్ని డబ్బులు పోగుచేసి ‘కిరాతకుడు’లోని క్యారెక్టర్‌కు కావాల్సిన క్యారెక్టర్ గెటప్ వేసుకొని ఫోటోలు దిగి సత్యమూర్తికి ఇచ్చి కోదండ రామిరెడ్డికి చూపించమని అడిగాను. నేనెవరో చెప్పొద్దు అన్నాను. ఆ ఫోటోలు చూసి నన్ను ఫిక్స్ చేశారు’’ అంటూ ‘కిరాతకుడు’లో తనకు క్యారెక్టర్ చేసే అవకాశం ఎలా వచ్చిందో బయటపెట్టారు ఎస్వీ కృష్ణారెడ్డి.


ఆర్టిస్ట్ అవ్వాలన్నదే నా ప్రయత్నం..


నటుడిగా పలు సినిమాలు చేసినా కూడా దర్శకుడిగానే సెటిల్ అయ్యారు ఎస్వీ కృష్ణారెడ్డి. దానికి కారమేంటో బయటపెట్టారు. ‘‘దర్శకుడిగా సక్సెస్ సాధించక ముందు ఆర్టిస్ట్ అవ్వాలన్నదే నా ప్రయత్నం. కానీ ఆర్టిస్ట్ అవ్వలేని పరిస్థితులు’’ అంటూ చెప్పుకొచ్చారు. దర్శకత్వంలో ఏ మాత్రం ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించడంపై కూడా ఆయన స్పందించారు. ‘‘ముందు మనపై మనకు నమ్మకం ఉండాలి. రేపటి గురించి మనకు తెలియదు కదా అలాంటప్పుడు కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. అదే మనలో ఉంటే మనం ఏదైనా చేసేయొచ్చు. ఇదే నాకు ఎప్పటికీ తెలిసిన సత్యం. అలాగే చేసుకుంటూ వెళ్లాను కాబట్టి వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చాను’’ అని తనపై తనకు ఉన్న నమ్మకం గురించి చెప్పారు ఎస్వీ. 


ఒక్కసారి ప్రయత్నించు అన్నారు..


‘‘దర్శకుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత మొదటి నుండి ఆర్టిస్ట్ కావాలనుకున్నావు కదా ఇప్పుడెందుకు ప్రయత్నించకూడదు అని అచ్చిరెడ్డి నాకు చెప్పారు. ఇప్పుడు అది లేదు. డైరెక్టర్‌గా సక్సెస్ సాధించాను కదా అని చెప్పాను. అయినా కూడా ఒకప్పుడు నువ్వు అనుకున్నావు కదా డబ్బులు ఉన్నాయి కదా చెయ్యి అన్నారు. ఒక్క సినిమా చేసి చూడు, తర్వాత కావాలంటే మనేయొచ్చు అంటే ‘ఉగాది’ చేశాను. తర్వాత ‘అభిషేకం’ చేశాను. దానికి అంతగా డబ్బులు రాలేదు. ఆ తర్వాత నాకు ఇది కరెక్ట్ కాదు. దర్శకత్వం మీదే దృష్టిపెడదాం అని పూర్తిగా దర్శకత్వంపైనే దృష్టిపెట్టా’’ అని చెప్పుకొచ్చారు ఎస్వీ కృష్ణారెడ్డి.


Also Read: మూడు గ్రామీ అవార్డులు అందుకున్నాడు - నేరుగా జైలుకు వెళ్లాడు, ర్యాపర్‌కు షాకిచ్చిన పోలీసులు