Suresh Kondeti : 'సంతోషం' మ్యాగజైన్ అధినేత, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి ప్రతీ ఏడాది సంతోషం అనే పేరుతో అవార్డులను నటీనటులకు అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా డిసెంబర్ 2న అవార్డులు ప్రదానం చేశారు. అయితే ఈ అవార్డుల ఫంక్షన్‌లో పలువురు కన్నడ సెలబ్రిటీలకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా.. దీనిపై సురేష్ కొండేటి ఎట్టకేలకు స్పందించారు.
ట్విటర్‌లో వివరణ..
కేవలం తెలుగులో మాత్రమే కాదు.. మొత్తం సౌత్‌లోని నాలుగు భాషల సెలబ్రిటీలకు సంతోషం సినిమా అవార్డులను అందజేయడం జరుగుతంది. ఈ అవార్డులను సురేష్ కొండేటి మాత్రమే ప్రారంభించి, 21 సంవత్సరాలుగా సక్సెస్‌ఫుల్‌గా వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇన్నేళ్లలో మొదటిసారి కన్నడ సినీ పరిశ్రమ నుంచి సంతోషం అవార్డులకు విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది సంతోషం అవార్డులను మరింత గ్రాండ్‌గా చేయాలన్న ఉద్దేశంతో గోవాను వేదికగా ఎంచుకున్నారు. అయితే అక్కడ కన్నడ సెలబ్రిటీలకు రూమ్స్ విషయంలో ఇబ్బందులు కలిగాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు కన్నడ ప్రేక్షకులు.. సురేష్ కొండేటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో ఆయన ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు.
ఉదేశ్యపూర్వకంగా చేసింది కాదు..
‘అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సంవత్సరం చాలా కష్టపడి, గ్రాండ్‌గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే .. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను. గోవా ఈవెంట్ లో జరిగిన కొంచం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్ కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్ లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్, అది ఉదేశపూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను. నా మీద కావాలనే కొంత మంది బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
కన్నడ వర్సెస్ తెలుగు ప్రేక్షకులు..
సురేష్ కొండేటి తెలుగువాడు కావడంతో కన్నడ ప్రేక్షకులంతా కలిసి తెలుగు ప్రేక్షకులను సైతం విమర్శించడం మొదలుపెట్టారు. ఫంక్షన్ నిర్వహించడం చేతకాకపోతే నిర్వహించడం ఎందుకు అని టాలీవుడ్ మొత్తంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. తప్పు అనేది ఒక వ్యక్తి వల్ల ఇండస్ట్రీ మొత్తాన్ని అనడం కరెక్ట్ కాదని రివర్స్ అవుతున్నారు. మొత్తానికి సురేష్ కొండేటి అవార్డుల ఫంక్షన్ వల్ల తెలుగు, కన్నడ ప్రేక్షకుల మధ్య రచ్చ మొదలయ్యింది.
Also Read: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం