సన్నీ లియోన్ (Sunny Leone)కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులు చాలా మందికి ఆవిడ తెలుసు. ఇంతకు ముందు తెలుగు సినిమాలు కొన్నిటిలో నటించారు కూడా! సన్నీ ఓ ప్రధాన పాత్ర పోషించిన తాజా తెలుగు సినిమా 'త్రిముఖ'. కొత్త ఏడాదిలో, అదీ జనవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
జనవరి 2వ తేదీన 'త్రిముఖ' విడుదల!సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'త్రిముఖ' సినిమాలో యోగేష్ కాళ్లే, అకృతి అగర్వాల్, సీఐడీ ఆదిత్య శ్రీవాస్తవ, మొట్ట రాజేంద్రన్, అషు రెడ్డి ఇతర ప్రధాన తారాగణం. రాజేష్ నాయుడు దర్శకత్వంలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
జనవరి 2, 2026న 'త్రిముఖ'ను థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నామని వివరించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు.
''సన్నీ లియోన్ ఇంతకు ముందు నటించిన సినిమాలతో పోలిస్తే 'త్రిముఖ' చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇదొక డిఫరెంట్ సినిమా. కమర్షియల్ అంశాలు అన్నిటితో తెరకెక్కిన సినిమా. కొత్త ఏడాదిలో ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుంది. క్రైమ్ థిల్లర్ జానర్ సినిమాగా రూపొందిన 'త్రిముఖ'లో సన్నీ లియోన్ ఏసీపీ రోల్ చేశారు'' అని దర్శకుడు రాజేష్ నాయుడు తెలిపారు. త్వరలో పాటలు, ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు వివరించారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా భారీ ఖర్చుతో ప్రొడ్యూస్ చేశామని చెప్పారు.
సన్నీ లియోన్, యోగేష్ కాళ్లే, అకృతి అగర్వాల్, సీఐడీ ఆదిత్య శ్రీవాస్తవ, మొట్ట రాజేంద్రన్, అషు రెడ్డి, ప్రవీణ్, 'షకలక' శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, 'జెమినీ' సురేష్ తదితరులు నటించిన 'త్రిముఖ' చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, కూర్పు: అఖిల్ బాలారాం, సౌండ్ డిజైన్: శ్రీను నాగపూరి, ఛాయాగ్రహణం: కొంగ శ్రీనివాస్.