Sumanth Ashwin about Niharika Konidela: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు సుమంత్ అశ్విన్. తన తండ్రిలాగా నిర్మాత అవ్వకుండా హీరో అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముందుగా ‘తూనీగ తూనీగ’ చిత్రంతో మొదటిసారి హీరోగా ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ పరవాలేదనిపించింది. అలా ఎక్కువగా ఫీడ్ గుడ్ కథలనే ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. అలా తన కెరీర్‌లో క్లీన్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. ఈ సినిమాలో మెగా హీరోయిన్ నిహారికతో జోడీకట్టాడు సుమంత్ అశ్విన్. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో నిహారికతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడాడు.


ఎనర్జీ వచ్చేస్తుంది..


‘‘తను చాలా మంచి నటి. వాళ్ల నాన్న నాగబాబు అంటే నాకు చాలా గౌరవం. తూనీగ తూనీగలో ఆయన హీరోయిన్ తండ్రిగా చేశారు. షూటింగ్ అంతా ఔట్‌డోర్‌లో జరిగింది. అక్కడ చాలా సమయం కలిసి గడిపాం. ఎలా చేయాలి అని సలహాలు ఇచ్చేవారు. ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. అలాగే నిహారికతో కూడా కలిసి పనిచేయడం చాలా బాగా అనిపించింది. సెట్‌లో ఎప్పుడూ తను హ్యాపీగా ఉంటుంది. అందరినీ హ్యాపీగా ఉంచుతుంది. అందరితో బాగా మాట్లాడుతుంది. ఈగో గానీ, సైలెంట్‌గా కూర్చోవడం గానీ చేయదు. తను సెట్‌లో ఉంటే అందరికీ ఎనర్జీ వచ్చేస్తుంది’’ అంటూ నాగబాబుతో, నిహారికతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నాడు సుమంత్ అశ్విన్.


చాలా ఫన్..


‘‘హ్యాపీ వెడ్డింగ్ ఇంటర్వెల్ సీన్ షూటింగ్ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఒక హోటల్ ముందు షూట్ చేస్తున్నాం. ఈ హోటల్‌లో దెయ్యాలు ఉంటాయంట అని మొదలుపెట్టింది. ఆ తర్వాత సెట్ అంతా దాని గురించి మాట్లాడుకున్నాం. మా మేకప్ మ్యాన్ కూడా నిజమే అని రకరకాలుగా మాట్లాడారు. అలా నిహారిక చాలా ఫన్ చేస్తుంది’’ అంటూ నిహారిక చేసిన చిలిపి పనిని గుర్తుచేసుకున్నాడు సుమంత్ అశ్విన్. అంతే కాకుండా ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నిహారిక పుట్టినరోజు జరిగిందని, తనకోసం స్పెషల్‌గా చెన్నై నుండి కేక్ తెప్పించానని కూడా అన్నాడు. 2018లో విడుదలయిన ‘హ్యాపీ వెడ్డింగ్’ సుమంత్ అశ్విన్‌తో పాటు నిహారికకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.


చాలారకాలుగా చెప్పారు..


హీరోగా సుమంత్ అశ్విన్ నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా.. వంశీలాంటి సీనియర్ దర్శకుడితో పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే వంశీతో కలిసి పనిచేసే ముందు ఆయన గురించి అందరూ చాలా రకాలుగా చెప్పారని, కానీ ఆయన మాత్రం తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారని సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. డబ్బింగ్ పూర్తయిన రోజు ఇద్దరూ లాంగ్ డ్రైవ్ కూడా వెళ్లారని అన్నాడు. ఇక సుమంత్ అశ్విన్ చివరిగా తన తండ్రి ఎమ్ ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘7 డేస్ 6 నైట్స్’ అనే చిత్రంలో కనిపించాడు.


Also Read: రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా - తెలుగు తెరకు మరో మలయాళీ అమ్మాయి!