Sumalatha About Darshan: రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం సినీ పరిశ్రమలోనే సంచలనంగా మారింది. ఒక్కసారిగా కన్నడ ప్రేక్షకులంతా దర్శన్‌ను తిడుతూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ హీరోకు సపోర్ట్‌గా నిలబడ్డారు. దర్శన్ అలా చేసి ఉండడని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం దర్శన్‌కు సపోర్ట్ చేశారు. అలాంటి వారి లిస్ట్‌లో అలనాటి నటి సుమలత కూడా యాడ్ అయ్యారు. దర్శన్ గురించి తనకు బాగా తెలుసంటూ చెప్పుకొచ్చారు సుమలత అంబరీష్.


25 ఏళ్లుగా తెలుసు..


ఒకప్పుడు నటిగా ఎన్నో హిట్ సినిమాలు, ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు సుమలత. కొన్నాళ్ల క్రితం పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యి అక్కడ బిజీ అయ్యారు. కన్నడలో దర్శన్‌తో కలిసి పలు సినిమాల్లో నటించారు సుమలత. దీంతో వీరిద్దరికి చాలాకాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌కు మద్దతుగా మాట్లాడారు. ‘‘నా ఫ్యామిలీకి, దర్శన్ ఫ్యామిలీకి మధ్య ఉన్న బాండింగ్ ఎవరికీ అర్థం కాదు. తను నాకు 25 ఏళ్లుగా తెలుసు. స్టార్ అవ్వకముందు నుండి తెలుసు. తన స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి నా కుటుంబంలో మా కొడుకులా కలిసిపోయాడు దర్శన్’’ అంటూ దర్శన్‌తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు సుమలత. దర్శన్ గురించి తనకు బాగా తెలుసు కాబట్టి తను ఒక హత్య చేయించాడు అంటే నమ్మడం కష్టంగా ఉందన్నారు.


మంచి మనసు..


దర్శన్‌తో చాలా క్లోజ్‌గా ఉండే సుమలత.. తను అరెస్ట్ అయినప్పటి నుండి ఈ విషయంపై స్పందించలేదు. దీంతో తనపై నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. పరిస్థితి చాలా కాంప్లికేట్‌గా ఉండడం వల్ల ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. ఏ తల్లి కూడా తన కొడుకును ఇలాంటి పరిస్థితిలో చూడాలని అనుకోదని, అందుకే దర్శన్‌ను ఇలా చూస్తుంటే కష్టంగా ఉందన్నారు. ఆధారాలు అన్నీ దర్శన్‌కు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇదంతా నమ్మడానికి తనకు కష్టంగా ఉందని తెలిపారు సుమలత. ‘‘నాకు ఒక మంచి మనసు ఉన్న వ్యక్తిగా దర్శన్ తెలుసు. జంతువుల పట్ల ప్రేమ, అవసరంలో ఉన్నవారికి సాయం చేసే గుణం చూస్తేనే తను ఎలాంటివాడో తెలుస్తుంది. తను ఇలాంటి క్రైమ్ చేసే మనిషి కాదు’’ అన్నారు.


శిక్ష పడలేదు..


‘‘దర్శన్ ఇప్పటికీ ఒక అనుమానితుడు మాత్రమే. ఇప్పటికీ ఇంకా నేరం నిరూపణ కాలేదు. తనకు ఇంకా శిక్ష కూడా పడలేదు. తన ట్రయల్ పూర్తి అవ్వనివ్వండి’’ అని కోరారు సుమలత. ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను చాలామంది ఫ్యాన్స్ ఒప్పుకున్నారు. నిజంగానే దర్శన్ అలాంటి వాడు కాదని కామెంట్స్ పెడుతున్నారు. దర్శన్ ఫ్రెండ్ అయిన పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్నాడనే కారణంతో రేణుకా స్వామి అనే వ్యక్తిని తన ఫ్యాన్స్ చేత కిడ్నాప్ చేయించాడని, ఆ తర్వాత తనను కొట్టి బెదిరించే క్రమంలో అతడు మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 9న సుమనహల్లి ప్రాంతంలో రేణుకా స్వామి మృతదేహం లభించింది.


 Read Also: మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!