NBK109 Release : నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ఇప్పుడు మరో హిట్ పై కన్నేశాడు. 'అఖండ' సినిమా నుంచి వరుస విజయాలు అందుకుంటున్న బాలయ్య ప్రస్తుతం బాబీ(కే. ఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. 'NBK109' అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి 'వాల్తేరు వీరయ్య' లాంటి మాస్ హిట్ అందించిన బాబీ.. ఈసారి బాలయ్యతో అంతకుమించి బ్లాక్ బస్టర్ డెలివర్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది.


'NBK109' థియేటర్స్ లోకి వచ్చేది అప్పుడే


'NBK109' ప్రాజెక్ట్ నుంచి మోషన్ పోస్టర్ తప్పితే మరే ఇతర అప్డేట్స్ రివీల్ చేయలేదు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇలాంటి తరుణంలో 'NBK109' రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాని జూలైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఈ సినిమాని దసరా బారిలో దింపాలని అనుకున్నారు. కానీ ఆ టైం కి ఎన్టీఆర్ 'దేవర'తో పాటు మరో రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. దానికంటే ముందు ఆగస్టులో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప2' , సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ 'OG' సినిమాలు రాబోతుండడంతో జూలై 19 లేదా 26 తేదీల్లో 'NBK109' రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.


శివరాత్రికి టీజర్ రిలీజ్


'NBK109' టైటిల్ అండ్ టీజర్ ని మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుందట. ఆరోజు టైటిల్ పోస్టర్ తో పాటు టీజర్ ని రిలీజ్ చేసి నందమూరి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు టీజర్ లోనే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


బాలయ్య సరసన 'జెర్సీ' భామ


'NBK109'లో బాలయ్య సరసన చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా త్రిష, తమన్నా, మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్ల పేర్లు వైరల్ అయ్యాయి. అయితే వాళ్ళు ఎవరు కాకుండా ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా 'జెర్సీ' మూవీ ఫ్రేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇటీవల సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన 'సైంధవ్' సినిమాలో నటించిన శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పుడు మరో సీనియర్ హీరో అయిన బాలయ్యతో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. మరో హీరోయిన్, తెలుగమ్మాయి చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా సైతం ఇందులో స్పెషల్ రోల్ చేస్తోంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : రామ్ చరణ్‌ను పక్కన పెట్టి - ఆ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న కన్నడ డైరెక్టర్!