దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం తన టీం ని మార్చబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటివరకు సాంకేతిక నిపుణుల విషయంలో దాదాపు ఒకే టీంని మెయింటైన్ చేసిన రాజమౌళి మహేష్ సినిమాకి ఓ కొత్త సినిమాటోగ్రాఫర్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమాటోగ్రాఫర్ ఎవరు? డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'ఆర్ ఆర్ ఆర్' తో పాన్ ఇండియా హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం రాజమౌళి మహేష్ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అది పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మహేష్ ప్రజెంట్ 'గుంటూరు కారం' షూటింగ్ తో బిజీగా ఉండడంతో అది కంప్లీట్ అయ్యాకే రాజమౌళి ప్రాజెక్టు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే రాజమౌళి కెరియర్ బిగినింగ్ నుంచి తన టెక్నీషియన్స్ ని పెద్దగా మార్చింది లేదు.
తన ఫస్ట్ మూవీ 'స్టూడెంట్ నెంబర్ వన్' కోసం అనుమోలు హరి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ తర్వాత 'సింహాద్రి' కోసం రవీంద్రబాబు, 'విక్రమార్కుడు' కోసం సర్వేశ్ మురారి, 'మర్యాద రామన్న' కోసం C.రాం ప్రసాద్ సినిమాటోగ్రాఫర్స్ గా పని చేశారు. వీళ్ళందరితో కంటే కే.కే సెంథిల్ కుమార్ తో రాజమౌళికి స్పెషల్ బాండింగ్ ఉంది. 'సై'తో మొదలైన వీరి ప్రయాణం 'మగధీర', 'ఈగ', 'బాహుబలి 1&2', 'ఆర్ ఆర్ ఆర్' వరకు సాగింది. జక్కన్న సినిమా అంటే అందులో కీరవాణి పాటలతోపాటు KK సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఉంటుంది. 'బాహుబలి' 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలకు సెంథిల్ సినిమాటోగ్రఫీ మెయిన్ హైలెట్ గా నిలిచింది.
అయితే ఈసారి మహేష్ సినిమా కోసం జక్కన్న సెంథిల్ కుమార్ ని కాకుండా మరో కొత్త సినిమాటోగ్రాఫర్ ని సెలెక్ట్ చేశారట. దీనికి కారణం సెంథిల్ కుమార్ ప్రస్తుతం దర్శకుడిగా ప్రయత్నాల్లో ఉండటమే అని అంటున్నారు. దీంతో ఆయన ప్లేస్ లో మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ PS వినోద్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 'పంజా', 'ధ్రువ', 'అలవైకుంఠపురంలో', 'అరవింద సమేత' లాంటి చిత్రాలకు PS వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.
ఇప్పుడు ఆయన్నే మహేష్ సినిమా 'SSMB29' కోసం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి భారీ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అడవుల్లో జరిగే అక్రమాలపై పోరాడే నాయకుడి పాత్రలో మహేష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read : అదిరిపోయే ధరకు 'సలార్' ఓటీటీ రైట్స్ - ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial