సినిమాల్లో జరిగే ఫైట్స్ విషయంలో మేకర్స్ అంతా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కావాలని చేయకపోయినా.. ఆ పొరపాట్ల వల్ల ఇతరులకు నష్టం జరిగే అవకాశం ఉంది. తాజాగా శ్రీరామ్ హీరోగా నటించిన ‘పిండం’ చిత్రం షూటింగ్ సమయంలో కూడా అదే జరిగింది. శ్రీరామ్ వల్ల సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరి రావు తలకు గాయమయ్యింది. ఇదే విషయాన్ని మూవీ టీమ్ ఎప్పుడో బయటపెట్టింది. అయితే అది తను కావాలని చేయలేదని, పొరపాటున జరిగిందని, అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందే అనే విషయాన్ని వివరించాడు శ్రీరామ్.


నా తప్పేం లేదు..
‘‘20 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ నా వల్ల వేరే ఆర్టిస్ట్‌కు ఇబ్బంది రాలేదు. నా వల్ల ఎవరికీ దెబ్బలు, ఇబ్బందిలాంటివి జరగలేదు. 20 ఏళ్లలో ప్రతీసారి తన్నులు నేను తినేవాడిని, దెబ్బలు నాకు తగిలేవి. విచిత్రంగా ఈ సినిమాలో మొదటిసారి నా చేతి నుంచి ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరుగుతుందని ఊహించలేదు. అది కావాలని జరిగింది కాదు’’ అంటూ తన తప్పు ఏం లేదని చెప్పుకొచ్చాడు శ్రీరామ్. ఆ తర్వాత అసలు సీన్ ఏంటి అని వివరించాడు. 


ఈశ్వరి రావు పీకను పట్టుకున్న ఒక ఆర్టిస్టు.. వెనక నుంచి ఒక ఫ్లవర్ వాజ్‌ను తీసుకొని.. అతడి తలపై కొట్టాలి శ్రీరామ్. ఆ ఫ్లవర్ వాజ్ చెక్కతో చేసిందే అయినా ఆ వ్యక్తికి దెబ్బ గట్టిగా తగలకూడదు అనే ఉద్దేశ్యంతో మెల్లగా కొట్టాలని అనుకున్నాడట. ముందుగానే అనుమానంతో ఈశ్వరి రావును కళ్లు మూసుకోమని చెప్పాడట. కానీ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది.


అదంతా సినిమాపై డెడికేషన్..
ఆ సీన్‌లో ఆర్టిస్ట్ తలపై ఫ్లవర్ వాజ్ పగలగొట్టగానే అందులోని ఒక ముక్క వెళ్లి ఈశ్వరి రావు తలకు తగిలిందట. దాని వల్ల ఈశ్వరి రావుకు వాపు కూడా అయ్యిందట. ఆ యాక్సిడెంట్ వల్ల షూటింగ్ ఆపేద్దామని అందరూ అనుకుంటూ ఉండగా.. ఈశ్వరి మాత్రం వాపు ఎక్కువయ్యేలోపు సీన్ పూర్తి చేద్దామని చెప్పారట. ‘‘ఒక మనిషి కనీసం అలా ఎలా ఆలోచించగలరు. ఇదంతా సినిమాపై డెడికేషనే. నాకు బాధగా అనిపించింది. కానీ ఆవిడకు కూడా తెలుసు అది నా తప్పు కాదు అని. ఒక సినిమాను అలా చూసి బాగుంది, బాలేదని తీసిపారేస్తారు. దాని వెనుక ఎంతోమంది ఎంతో కష్టపడి ఉంటారు’’ అని సినిమా కోసం అందరూ ఎంత కష్టపడతారో చెప్పుకొచ్చాడు శ్రీరామ్.


ఆ తర్వాత ఏం గుర్తులేదు..
సినిమాల్లో డమ్మీలు కూడా కరెక్ట్‌గా తయారు చేయడం లేదని శ్రీరామ్ వాపోయాడు. క్వాలిటీ చెక్ కూడా ఉండడం లేదని అన్నాడు. ఒకసారి డమ్మీ రాడ్‌తో తనను కొడితే.. ముక్కుకు తగిలి బ్లాక్‌ఔట్ అయిపోయానని, ఆ తర్వాత తనకు ఏం గుర్తులేదని చెప్పాడు. డాక్టర్ చదవకపోయినా.. తనకు ఏ దెబ్బకు ఏ మందు వేసుకోవాలి, ఆ దెబ్బ తగ్గడానికి ఎంత సమయం పడుతుంది అని తనకు తెలుసు అని అన్నాడు. ‘పిండం’ సినిమా కోసం ఒకే లైట్ పెట్టుకొని మొత్తం పొగలో అయిదు రోజులు షూటింగ్ చేశామని, దాని వల్ల చాలా ఇబ్బంది కలిగిందని శ్రీరామ్ బయటపెట్టాడు. పూర్తిగా చీకటిలో నేచురల్‌గా వచ్చే లైట్‌తోనే షూటింగ్ జరిగిందన్నాడు. టీమ్ అంతా చాలా కష్టపడింది అంటూ అందరినీ పేరుపేరునా గుర్తుచేసుకున్నాడు శ్రీరామ్.


Also Read: విజయ్ దేవరకొండ పై అసభ్యకర వార్తలు ప్రసారం - వ్యక్తి అరెస్ట్