మంచి, చెడు... ప్రతి రంగంలోనూ ఉంటాయి. కొత్త అడుగులు వేసే ప్రతి చోట ఎదురు అవుతూ ఉంటాయి. ఏఐ టెక్నాలజీ ద్వారా కొన్ని అంశాలలో ఎంత మంచి జరుగుతుందో... మరికొందరికి అంతకు మించి చెడు కూడా జరుగుతోంది. మరి ముఖ్యంగా హీరోయిన్లకు సరికొత్త ముప్పు ఏర్పడింది. ఒరిజినల్ అనిపించేలా మార్ఫింగ్ వీడియోలు ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు కొందరు. అందాల భామలను అసభ్యంగా చూపిస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
చేతులు జోడించి మొక్కుతున్నా...ప్రతి మహిళకు నమ్మకాన్ని ఇవ్వండి!టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేసేలా ఉండాలి తప్ప మరింత క్లిష్టతరంగా మార్చకూడదనేది తన అభిప్రాయం అని శ్రీలీల తెలిపారు. ఏఐ జనరేటెడ్ చెత్త (నాన్సన్స్)ను సపోర్ట్ చేయవద్దని ప్రతి సోషల్ మీడియా యూజర్‌కు చేతులు జోడించి మొక్కారామె.
Also Read: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులపై నెటిజన్స్ ఆగ్రహం
టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించడం వేరని, అసభ్యతకు వాడటం వేరని రెండిటి మధ్య తేడా ఉందని, అది ప్రతి ఒక్కరూ గమనించాలని శ్రీ లీల విజ్ఞప్తి చేశారు. ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కుమార్తె లేదా మనవరాలు లేదా సిస్టర్ లేదా సహోద్యోగి లేదా తనకు నచ్చిన కళ (వృత్తి - సినిమా రంగం) ఎంపిక చేసుకున్న మహిళ అయ్యి ఉంటుందని ఆవిడ వివరించారు. సినిమా ఇండస్ట్రీ భాగస్వామి అయినందుకు మహిళలు సంతోషపడేలా వాళ్లకు రక్షణతో కూడిన వాతావరణం ఉందనే నమ్మకాన్ని ఇవ్వాలని శ్రీ లీల కోరారు.
తనకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆన్‌లైన్‌లో జరిగే కొన్ని అంశాలను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నానని, కొన్నిటిని సన్నిహితులు తన దృష్టికి తీసుకు రాగా ఓ విషయం తనను బాధించిందని శ్రీ లీల ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితి తన తోటి హీరోయిన్లకు సైతం ఎదురైందని, అందరి తరఫున తమకు అండగా నిలబడమని శ్రీ లీల కోరారు. డీప్ ఫేక్ వీడియోలు, ఆన్‌లైన్ వేధింపులపై ఇంతకు ముందు సైతం కొంత మంది హీరోయిన్లు గళం వినిపించారు. తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు శ్రీ లీల సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సినిమాల విషయానికి వస్తే... ఇటీవల మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర'లో శ్రీ లీల సందడి చేశారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్', తమిళంలో శివ కార్తికేయన్ 'పరాశక్తి', హిందీలో మరో సినిమా చేస్తున్నారు.