Hanuman Movie Tickets Price: తెలుగు సినిమా పరిశ్రమలో 'హనుమాన్' సంచలనం సృష్టించింది.  తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీసు దగ్గర సంచలనం సృష్టిస్తోంది. తక్కువ అంచనాలతో చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో రికార్డుల మోత మోగించింది. చిన్న హీరో, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా విడుదలై నెల రోజులు పూర్తయినా థియేటర్లలు చక్కటి ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి.  


‘హనుమాన్’ టికెట్ ధరలు భారీగా తగ్గింపు


ఈ నేపథ్యంలో ‘హనుమాన్’ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే దిశగా ఈ అడుగు వేసింది. ‘హనుమాన్’ మూవీ టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సింగిల్‌ స్క్రీన్‌ టికెట్‌ ధర రూ.175 ఉంది. ఇకపై రూ.100కే అందించనున్నట్లు తెలిపింది. అటు మల్టీ ప్లెక్స్‌ లలో రూ.295గా ఉన్న టికెట్‌ ధరను రూ.150కే ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, ఈ అవకాశం కేవలం ఫిబ్రవరి 16 నుంచి 23 వరకూ అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ తో ‘హనుమాన్’ సినిమా చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది.   


సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ‘హనుమాన్’


నిజానికి ఇటీవల విడుదలైన సినిమాలు మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం ఇంచుమించు ఇంతే సమయంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, ‘హనుమాన్’ మూవీ మాత్రం ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పటికీ 300లకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. టికెట్ ధరలు తగ్గించడంతో ప్రేక్షకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.


రికార్డుల మోత మోగించిన ‘హనుమాన్’


'హ‌నుమాన్' ఇప్ప‌టి రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. నార్త్ లో రిలీజైన ఈ సినిమా.. స‌రికొత్త రికార్డు సృష్టించింది. రూ.50 కోట్లు సాధించిన సినిమాల జాబితాలోకి చేరిపోయింది. ఇప్పటివరకు 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'పుష్ప', 'RRR', 'రోబో 2', 'కాంతార', 'KGF 2' సినిమాలు మాత్రమే ఈ రికార్డుని సాధించాయి. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రజినీకాంత్, యశ్, రిషబ్ శెట్టి తర్వాత తేజ సజ్జ నార్త్ లో రూ.50 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. మ‌న దేశంలోనే కాకుండా.. ఓవ‌ర్ సీస్ లో కూడా స‌త్తా చాటింది ఈ సినిమా.


‘హనుమాన్‌’ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్‌ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు.  అంజనాద్రి అనే ఊహాజనిత గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఓ సాధారణ యువకుడికి  ఆంజనేయుడి ద్వారా పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపించారు. 


Read Also: లేటు వయసులో లేచిపోవడం ఏమిటో - రాజేంద్ర ప్రసాద్, జయప్రదల ‘లవ్ @ 65’ ట్రైలర్ చూశారా?