విక్రాంత్ (Vikranth)ను కథానాయకుడిగా ప‌రిచ‌యం చేస్తూ... డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పార్క్' (Spark Movie). అరవింద్‌ కుమార్‌ రవి వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. 


ప్రేమ... యాక్షన్... ప్రతీకారం!
Spark Movie Telugu : 'స్పార్క్' టీజర్ చూస్తే... ఇదొక చిన్న సినిమా అని ఎక్కడా కూడా అనిపించదు. ప్రొడక్షన్ వేల్యూస్ అంత గొప్పగా ఉన్నాయి. కెమెరా వర్క్ కూడా చాలా బావుంది. కొత్త హీరో మీద బాగా ఖర్చు చేసినట్లు అర్థం అవుతోంది. 


'స్పార్క్' టీజర్ విషయానికి వస్తే... ఆ విజువల్స్ స్టార్టింగులోనే సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పారు. నేలపై వరుసగా పడి ఉన్న శవాలు, ఆ తూటాలు చూస్తే... హీరో వాళ్ళను షూట్ చేసినట్లు అర్థం అవుతోంది. తర్వాత సన్నివేశాల్లో హీరో వెంట పోలీసులు పడటం, ఫైరింగ్ వంటివి చూస్తుంటే భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రేమ, యాక్షన్, ప్రతీకారం సినిమాలో ఉన్నాయని టీజర్ ద్వారా చెప్పారు. 


హీరోతో పాటు హీరోయిన్లు మెహరీన్, రుక్సార్... ఇద్దరినీ టీజర్లో చూపించారు. 'బిగ్ బాస్' ఫేమ్ అషురెడ్డి ఓ కీలక పాత్ర చేసినట్లు అర్థం అవుతోంది. ఐలాండ్ లోని అందమైన లొకేషన్లలో విక్రాంత్, మెహరీన్ మీద తీసిన పాట బావుంది.  



నేపథ్య సంగీతం గమనించారా?
'స్పార్క్' చిత్రానికి హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా. ఒక విధంగా చెప్పాలంటే... ఆయన అంగీకరించిన తొలి తెలుగు సినిమా కూడా ఇది. టీజర్ అంతా ఓ ఎత్తు... అందులో నేపథ్య సంగీతం మరో ఎత్తు.


Also Read : మాటల్లేవ్, కోతలే - కుమ్మేసిన రజనీకాంత్, హిట్టు బొమ్మే!
 
ఇంగ్లీష్ సాహిత్యంతో కూడిన పాటకు హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ అద్భుతంగా ఉంది. యాక్షన్ సీన్లలో నేపథ్య సంగీతం కూడా! 'స్పార్క్'తో పాటు విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' సినిమాకు కూడా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఆ సినిమా పాటలు హిట్ అయ్యాయి.


Also Read ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' - ఈసారి సంక్రాంతి మామూలుగా ఉండదు!



ప్రతినాయకుడిగా గురు సోమసుందరం
మలయాళంలో రూపొందిన సూపర్ హీరో సినిమా 'మిన్నల్ మురళి'. అందులో టీ షాపులో పని చేసే వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తాయి చూడండి! ఆ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన గురు సోమసుందరం (Guru Somasundaram) గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆయన తెలుగులో సినిమా చేస్తున్నారు. అదీ ప్రతినాయకుడిగా! విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారన్నమాట!
  
'స్పార్క్' సినిమాలో నాజ‌ర్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, 'వెన్నెల' కిశోర్, షాయాజీ షిండే, సత్య, 'వెన్నెల' కిశోర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు దగ్గర సహాయకుడిగా పని చేసిన రవి వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial