పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie). ఆల్రెడీ గ్లింప్స్ విడుదల చేశారు. అలాగని, సినిమా షూటింగ్ ఏమీ పూర్తి కాలేదు. అసలు, ఆ మాటకు వస్తే... ఇప్పటి వరకు జరిగిన షూటింగులో తీసింది కొంత మాత్రమే! మహా అయితే 25 శాతం కూడా పూర్తి అయ్యి ఉండదు. అందుకని, ముందుగా అనుకున్నట్లు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా విడుదల కావడం కష్టమనే మాటలు ఫిల్మ్ నగర్, ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. తాజా సమాచారం ఏమిటంటే... సంక్రాంతి సినిమా వస్తుందట!


ఎన్నికలకు ముందు విడుదల చేయాలని పవన్...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను ప్రజల ముందుకు తీసుకు రావాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారట. వచ్చే ఏడాది జూన్ లేదా దానికి రెండు మూడు నెలల ముందు ఏపీలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 


ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సినిమాలకు కాస్త విరామం ఇచ్చి, జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఎలా లేదన్నా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత సినిమాలకు ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు. ముందు నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్'ను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. సో, పెద్ద పండక్కి సినిమాలు వచ్చే అవకాశం ఉంది.  


సంక్రాంతి బరిలో మరో మూడు సినిమాలు!
Sankranti 2024 Telugu Movies : ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో మరో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న 'గుంటూరు కారం' సినిమానూ సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే... షూటింగ్ జరిగే స్పీడును బట్టి విడుదల తేదీ మారవచ్చు. 


తేజా సజ్జా హీరోగా'అ!', 'కల్కి' ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హను - మాన్' కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న 'ఈగల్' కూడా సంక్రాంతి బరిలో ఉంది. నిజానికి, రెబల్ స్టార్ ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' కూడా సంక్రాంతికి రావాలి. కానీ, వాయిదా పడింది. టైటిల్ గ్లింప్స్‌లో రిలీజ్ డేట్ ఇవ్వలేదు. మేకి వాయిదా పడినట్లు టాక్.


Also Read : పవన్‌కు ఎంత ఇచ్చామనేది చెప్పను, అంబటివి ఆరోపణలు మాత్రమే - 'బ్రో' నిర్మాత విశ్వప్రసాద్



 
'ఉస్తాద్ భగత్ సింగ్'ను మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయిక. ఆమె ఫస్ట్ లుక్ కూడా కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. 'ఉస్తాద్...'లో మరో కథానాయికకు కూడా చోటు ఉందని సమాచారం. 


'ఉస్తాద్ భగత్ సింగ్'లో రెండో కథానాయికగా 'ఏజెంట్' ఫేమ్ సాక్షి వైద్యను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఆమె రోల్ కొత్తగా ఉంటుందని టాక్. ఇక, పోలీస్ అధికారి పాత్రలో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ బద్దలైపోతుందని గ్లింప్స్‌లో ఆయనతోనే హరీష్ శంకర్ చెప్పించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కె. దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 


Also Read : మానస్, దీపికల 'బ్రహ్మముడి' - ఈ సీరియల్ చెబుతోన్న జీవిత సత్యాలు




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial