టాలీవుడ్ దర్శక నిర్మాతలకు శ్రీలీలా ఫొబియా పట్టుకుంది. ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. దీంతో మొన్నటివరకు లీడ్‌లో ఉన్న హీరోయిన్లకు సైతం కొత్త అవకాశాలు దొరకడం కష్టమైపోయింది. ముఖ్యంగా కీర్తి సురేష్, కృతి శెట్టి టాలీవుడ్‌లో దుకాణం కట్టేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ కోలీవుడ్, మాలీవుడ్‌లో అవకాశాలను అందిపుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.


తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్లలలో కీర్తి సురేష్ ఒకరు. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్, ‘మహానటి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇందులో నటనకు గాను ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది. ఈ సినిమా అనంతరం వచ్చిన ‘మిస్ ఇండియా’, ‘రంగ్ దే’, ‘పెద్దన్న’ లాంటి సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆమెకు ఉన్న క్రేజ్ చాలా వరకు తగ్గిపోయింది. రీసెంట్ గా వచ్చిన ‘దసరా’తో మళ్లీ విజయాన్ని అందుకుంది. నానితో కలిసి చేసిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది.


కీర్తి సురేష్ ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ‘భోలా శంకర్’ చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కించబోతున్న ఓ చిత్రం కోసం కీర్తితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్‌ లు మాత్రమే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి. అటు తమిళంలో ఐదు సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి తమిళ సినిమాపైన ఫుల్ ఫోకస్ పెట్టాలని కీర్తి సురేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.






తమిళ్, మలయాళీ ఫిల్మ్ ఇండస్ట్రీపై కృతి శెట్టి ఫోకస్


అటు యువ సంచలనం కృతి శెట్టి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆమె మెల్లగా మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలపై దృష్టిసారించింది. ప్రస్తుతం అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. కృతి తన తొలి తెలుగు చిత్రం ‘ఉప్పెన’తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చాయి కానీ, అనుకున్న స్థాయిలో ఆమె నటించిన చిత్రాలు ఆడలేదు. ‘ది వారియర్’, ‘కస్టడీ’, ‘మాచర్ల నియోజకవర్గంలో’ సినిమాలు ‘ఉప్పెన’ మాదిరి  బ్లాక్‌ బస్టర్ విజయాన్ని పునరావృతం చేయలేకపోయాయి.  ఇటీవలి వరుస యావరేజ్ పెర్ఫార్మెన్స్ కారణంగా కృతికి తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఆమె మలయాళంలో స్టార్ హీరో టోవినో థామస్‌తో కలిసి భారీ బడ్జెట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతో విజయం సాధిస్తే మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా ఎదిగే అవకాశం ఉంది.






Read Also: మూడో భార్యతో పవన్ కల్యాణ్ విడాకులు? ఆవిడ రష్యాకు తిరిగి వెళ్లిపోయారా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial