ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ (Rasool Ellore) ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించిన సినిమా 'స్కై' (Sky Telugu Movie). అగాధమంత బాధ నుంచి ఆకాశం అంత ప్రేమ పుడితే... అనేది ఉప శీర్షిక. పృథ్వి పేరిచర్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంద్, మురళీ కృష్ణం రాజు, శృతి శెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్) ప్రధాన తారాగణం. దివంగత రాకేష్ మాస్టర్ ఓ కీలక పాత్ర చేశారు. 


'స్కై' షూటింగ్ పూర్తి - ప్రజెంట్ స్టేటస్ ఏమిటంటే?
'స్కై' సినిమాను వేలర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ పతాకంపై నాగి రెడ్డి గుంటక, మురళీ కృష్ణం రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


అసలు, 'స్కై' కాన్సెప్ట్ ఏమిటి?
ప్రస్తుతం మనిషి అందరి మధ్యలో ఉంటున్నాడు. నగరాల్లో మనుషుల జీవన విధానాలను గమనిస్తే... అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలు. ఎవరితోనూ మనస్ఫూర్తిగా మాట్లాడే తీరిక ఉండటం లేదు. అసలు, ఎవరూ లేకపోతే?


Also Read : తెలుగులో పవన్... తమిళంలో విజయ్... స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!


''ఒక మనిషి జీవితంలో అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే? సంవత్సరాల తరబడి తాను అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనం మీద విజయం సాధించాడా? లేదా? లేదంటే 'ఏకాకి జీవితమే కదా' అని రోజు గడవడం కోసం తన చుట్టుపక్కల వాళ్ళను మోసం చేస్తూ జీవితం వెళ్లదీస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా 'స్కై' చిత్ర కథాంశం'' అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు.


'స్కై' చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ''రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ మా చిత్రానికి ప్రధాన బలం. పృథ్వి పేరిచర్ల మంచి కథ రాశారు. ఆ కథను అంతే ప్రభావవంతంగా తెరకెక్కించారు. ఇటీవల ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నాయి. ఓ వైపు భారీ కమర్షియల్ చిత్రాలు చూస్తున్నారు. మరో వైపు కొత్త కథలు, విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలను సైతం ఆదరిస్తున్నారు. మా సినిమాకు కూడా ప్రేక్షకాదరణ ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చే చిత్రమిది'' అని చెప్పారు.


Also Read షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?



కృషవంశీ 'గులాబీ', తేజ 'నువ్వు నేను', త్రివిక్రమ్ 'జల్సా', సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన 'కిక్', 'ఊసరవెల్లి', 'ఏజెంట్' వంటి చిత్రాలకు రసూల్ ఎల్లోర్ పని చేశారు. కథ నచ్చడంతో ఔత్సాహిక నటీనటులుతో తెరకెక్కిన 'స్కై'కి పని చేయడానికి అంగీకరించారని చిత్ర బృందం పేర్కొంది. 


'స్కై' చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్ : కృష్ణా డిజిటల్స్, మాటలు : మురళీ కృష్ణం రాజు - పృథ్వి పేరిచర్ల, సంగీతం : శివ ప్రసాద్, కూర్పు : సురేష్ అర్స్, ఛాయాగ్రహణం : రసూల్ ఎల్లోర్, నిర్మాతలు : నాగి రెడ్డి గుంటక - మురళీ కృష్ణం రాజు, కథ - కథనం - మాటలు - దర్శకత్వం: పృథ్వి పేరిచర్ల. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial