టిల్లు స్క్వేర్ (Tillu Square)... 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్. సినిమా స్టార్టింగ్ నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ సినిమా సీక్వెల్ అని కాదు... హీరోయిన్లు వాకౌట్ చేయడం, సీక్వెల్‌కు దర్శకుడిని చేంజ్ చేయడం వంటి అంశాలు కూడా 'టిల్లు స్క్వేర్'ను వార్తల్లో ఉండేలా చేశాయి. సినిమాపై చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని అంశాల గురించి సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడతానని ట్వీట్ చేశారు. దాంతో ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు? ఏం నిజాలు బయట పెడతారు? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మార్చిలో 'టిల్లు స్క్వేర్' రిలీజ్
Tillu Square Release In March 2023 : ''ప్రేక్షకులు అందరికీ మీరు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు. సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇక.. రూమర్స్ అంటారా? త్వరలో ప్రోపర్ ఇంటర్వ్యూతో పుకార్లు అన్నిటినీ క్లియర్ చేద్దాం'' అని సిద్ధూ జొన్నలగడ్డ ట్వీట్ చేశారు. 'టిల్లు స్క్వేర్'తో ప్రేక్షకులు కొత్త వినోదం అందిస్తానని ఆయన ప్రామిస్ చేశారు. అసలు, 'డీజే టిల్లు' సీక్వెల్ చుట్టూ ఉన్న రూమర్స్ ఏంటి? అనే విషయానికి వస్తే...
విమల్ కృష్ణ పోయే...
మల్లిక్ రామ్ వచ్చే!
'టిల్లు స్క్వేర్' విషయంలో మొదట షికారు చేసిన పుకారు... దర్శకుడి మార్పు గురించి! 'డీజే టిల్లు'లో సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కథానాయకుడిగా నటించడం మాత్రమే కాదు... ఆ చిత్ర దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి కథ రాశారు. టిల్లు క్యారెక్టరైజేషన్ వెనుక ఆయన రైటింగ్ కూడా ఉంది. అయితే... సినిమా హిట్ తర్వాత సీక్వెల్ కోసం విమల్ కృష్ణను కాకుండా మరొక దర్శకుడిని తీసుకోవడం డిస్కషన్ పాయింట్ అయ్యింది. విమల్ కృష్ణకు, సిద్ధూ జొన్నలగడ్డ మధ్య క్రియేటివ్ డిఫరెన్సులు వచ్చాయని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పుడు ఆ టాపిక్ గురించి సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడాల్సి ఉంటుంది.
అనుపమ పోయే...
మడోన్నా వచ్చే!
'టిల్లు స్క్వేర్' సినిమా ఇప్పుడు వార్తల్లో ఉండటానికి కారణం హీరోయిన్ సినిమా నుంచి తప్పుకోవడం! తొలుత ఈ సినిమాలో 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీలను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే... నిర్మాణ సంస్థలు ఎప్పుడూ ఆ విషయాన్ని వెల్లడించలేదు అనుకోండి. 'టిల్లు స్క్వేర్'లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ అని అఫీషియల్‌గా చెప్పారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే... సినిమాలో అనుపమ లేదు. ఆవిడను తీసేసి, మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian In Tillu Square)ను ఎంపిక చేశారు. అనుపమ సినిమా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? అనేది హాట్ టాపిక్ అవుతోంది.
Also Read : పల్లెటూరిలో యుగాంతం - కార్తికేయ 'బెదురులంక 2012'
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ మధ్య మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయని బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2' చూస్తే తెలుస్తుంది. ఆ షోలో ఉన్నప్పుడు అనుపమకు సిద్ధూ ఫోన్ చేశారు. అప్పుడు బాగా మాట్లాడుకున్నారు. డేట్స్ అడ్జస్ట్ చేయలేక 'టిల్లు స్క్వేర్' నుంచి తప్పుకొన్నారా? లేదంటే మరొక కారణం ఉందా? అనేది ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే తప్ప తెలియదు. అనుపమ కంటే ముందు సిద్ధూ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.