Tillu Square Censor: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'. ఇది బ్లాక్‍ బాస్టర్ 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‍. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా వచ్చే వారం థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 


‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యు/ఎ' (U/A) సర్టిఫికేట్ జారీ చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా డబుల్ ఫన్ & డబుల్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నట్లు పేర్కొంటూ.. టిల్లు న్యూ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి ఎంతగానో ఆస్వాదించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆద్యంతం వినోదం అందించడానికి చిత్ర బృందం చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారని.. ముఖ్యంగా టిల్లు పాత్ర, అతను పలికే సంభాషణలు వారిని ఎంతగానో అలరించాయని అంటున్నారు.






నిజానికి ‘టిల్లు స్క్వేర్’ ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత ఈ సినిమాకు కచ్చితంగా సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ ఇస్తుందని అందరూ భావించారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ లో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్స్, లిల్లీ క్యారక్టర్ లో అనుపమ గ్లామర్ షో చూసి ఈ మూవీ 'పెద్దలకు మాత్రమే' అని ఫిక్స్ అయ్యారు. అయితే అడల్ట్ కంటెంట్ విషయంలో నిర్మాత రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చారు. 'డీజే టిల్లు' యూత్ కి కనెక్ట్ అయితే, దాని సీక్వెల్ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందని మీడియా ముఖంగా చెప్పారు. అయినా సరే ఎందుకనో 'ఏ' సర్టిఫికెట్ రావచ్చనే అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఫ్యామిలీతో కలిసి పిల్లలు కూడా ఈ సినిమాకు వెళ్లొచ్చని స్పష్టమైంది. 


'డీజే టిల్లు'లో మాదిరిగానే సిద్దు జొన్నలగడ్డ స్వాగ్, అతని డైలాగ్ డైలీవరీ, యాటిట్యూడ్ వంటికి 'టిల్లు స్క్వేర్' లోనూ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. అనుపమా పరమేశ్వరన్ మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచేసింది. తన కెరీర్‌లో తొలిసారిగా లిల్లీ అనే బోల్డ్ క్యారెక్టర్‌ను పోషించింది. హాట్ లుక్స్, రొమాంటిక్ లిప్ లాక్ సీన్స్ లో రాధికా పాత్రను మరిపించింది. ఫస్ట్ పార్ట్ లో రాధికతో క్రైమ్‌ ఎపిసోడ్‌ లాగానే, ఈ సీక్వెల్ లో కూడా మరో ఇంట్రెస్టింగ్‌ డ్రామా ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.


'టిల్లు స్క్వేర్' సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ ప్లే  డైలాగ్స్ అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం సమకూర్చగా.. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 29న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇది ‘డీజే టిల్లు’ను మించిన విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈసారి థియేటర్లలో రెట్టింపు వినోదాన్ని, రెట్టింపు మజాని అందిస్తామని హామీ ఇస్తున్నారు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకంటుందో చూడాలి.


Also Read: యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య?