Naga Chaitanya: అక్కినేని మూడో తరం నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో నాగచైతన్య.. యువసామ్రాట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. గత నాలుగేళ్లలో మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి వరుస విజయాలు అందుకున్న చైతూ.. థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ వంటి బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ చవిచూశారు. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ లు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న చై.. ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.


నాగచైతన్య ప్రస్తుతం కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ప్రేమమ్, సవ్యసాచి తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో లవ్ స్టోరీ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ క్రేజీప్రాజెక్ట్ సెట్స్ మీద వుండగానే డైరెక్టర్ కార్తీక్ దండు కథను చైతూ ఓకే చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.


'భం భోలేనాథ్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన కార్తీక్ దండు.. 'విరూపాక్ష' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సాయి దుర్గ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. గతేడాది సమ్మర్ లో పాన్ ఇండియా వైడ్ గా రిలీజైన ఈ మిస్టిక్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. సినిమా వచ్చి ఏడాది కావస్తున్నా ఇంకా అతని కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. అయితే తదుపరి చిత్రాన్ని యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.


కార్తీక్ దండు చెప్పిన స్టోరీ నాగచైతన్యకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది ఏ జోనర్ లో ఉంటుందనే తెలియదు కానీ, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్ లో తెరకెక్కుతుందని అంటున్నారు. బివిఎస్ఎస్ఎన్ ప్రసాద్ గతంలో చైతూతో 'దోచేయ్' అనే సినిమా.. అఖిల్ అక్కినేనితో 'మిస్టర్ మజ్ను' మూవీ చేశారు. గతంలో నాగేశ్వరరావుతో కూడా ఓ సినిమా నిర్మించారు. ఇప్పుడు చైతన్యతో మరో ప్రాజెక్ట్ చెయ్యడానికి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.


ఇదిలా ఉంటే 'మజిలీ' తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైతన్య కాంబినేషన్ లో మరో మూవీ రానుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇరు వర్గాల నుంచి ఇప్పటికే క్లారిటీ కూడా వచ్చింది. ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో స్క్రిప్టు సిద్ధమైందని అందరూ ఫిక్స్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా వుంటుందని టాక్ నడిచింది. అయితే ఇప్పుడు కార్తీక్ దండు కథను చై అంగీకరించినట్లుగా టాక్ నడుస్తోంది. మరి 'తండేల్' తర్వాత ఇద్దరు దర్శకులలో ఎవరితో చైతన్య జట్టు కడతారో వేచి చూడాలి.


Also Read: ‘హనుమాన్’ కాన్సెప్ట్తో హాలీవుడ్ మూవీ.. 'మంకీ మ్యాన్' ట్రైలర్-2 చూశారా?