Monkey Man Trailer 2: ఇటీవలి కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో హిందూ పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, దైవత్వం, ఆధ్యాత్మికం నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడంతో, ఈ ట్రెండ్ ను ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే హిందూ మైథాలాజీ కాన్సెప్ట్ హలీవుడ్ వరకూ వెళ్లింది. పురాణాల్లోని హనుమంతుడి పాత్ర స్ఫూర్తితో ఇప్పుడు 'మంకీ మ్యాన్' అనే ఇంగ్లీష్ సినిమాను తెరకెక్కించారు. 


'స్లమ్ డాగ్ మిలియనీర్' 'హోటల్ ముంబై' ఫేమ్ దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంకీ మ్యాన్’. ఇందులో శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన ప్రతిభను చాటుకున్న తెలుగమ్మాయి.. ఈ సినిమాతో హాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో లేటెస్టుగా మరో ట్రైలర్ ను మేకర్స్ అవిష్కరించారు.


చిన్నతనంలోనే తల్లితో పాటుగా సర్వస్వం కోల్పోయిన హీరో.. 'ధనవంతులు మమ్మల్ని మనుషులుగా కూడా చూడరు' అంటూ తన గురించి చెప్పుకోవడంతో ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ 2 ప్రారంభం అవుతుంది. పేద ప్రజలను కాపాడే వ్యక్తిగా తాను భావిస్తూ, హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ఫైట్ చేసే యువకుడి కథే ఈ సినిమా అని అర్థమవుతోంది. ఇందులో ఒక వెయిటర్ గా కనిపిస్తున్న దేవ్ పటేల్‌.. ఒక ఫైటర్ గా మారిన విధానాన్ని మనం చూడొచ్చు. అలానే తన తల్లి మరణానికి కారణమైన వ్యక్తిపై రివేంజ్ తీర్చుకోడానికి అతను ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


''రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. ది వైట్ మంకీ" అంటూ ఫస్ట్ ట్రైలర్ లోనే 'మంకీ మ్యాన్' సారాంశం ఏంటనేది వెల్లడించారు. ఇప్పుడు ట్రైలర్-2 లో "ఒక మనిషి దేవుడిని సవాలు చేస్తే.. అతను మనిషి కంటే ఎక్కువగా, మృగం కంటే ఎక్కువగా మారాలి" అని చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. 



అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో పాటుగా ఎమోషనల్ కంటెంట్ కలబోతగా వచ్చిన 'మంకీ మ్యాన్' రెండో ట్రైలర్‌ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దేవ్ పటేల్‌ మంకీ మాస్క్ వేసుకొని చేసే ఫైట్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు 'జాన్ విక్' సినిమాలని గుర్తు చేస్తాయి. ట్రైలర్ మధ్యలో వచ్చే హనుమాన్ రిఫరెన్స్ షాట్స్, మదర్ సెంటిమెంట్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. 


'మంకీ మ్యాన్' పేరుకి హాలీవుడ్ సినిమా అయినా, 'స్లమ్ డాగ్ మిలియనీర్' తరహోనే ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ కావడంతో.. ఎక్కువ శాతం ఇండియన్ యాక్టర్స్ నే తీసుకున్నారు. శోభితాతోపాటు మకరంద్ దేశ్ పాండే, సికందర్ ఖేర్, అశ్విని కల్సేకర్, విపిన్ శర్మ, అదితి కల్కుంటె, పిటో బాష్ త్రిపాఠి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో శోభితా ఒక బార్ డ్యాన్సర్‌గా కనిపించగా.. సిఖందర్ ఖేర్, మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రల్లో కనిపిస్తున్నారు.


'మంకీ మ్యాన్' మూవీతో హీరో దేవ్ పటేల్ డైరెక్టర్‌గా మారాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాణంలోనూ భాగం పంచుకున్నాడు. స్టోరీ, స్క్రీన్‌ ప్లే కూడా తానే స్వయంగా రాసుకున్నాడు. దేవ్ పటేల్‌తో పాటు జోమోన్ థామస్, జోర్డాన్ పీలే, విన్ రోసెన్ఫెల్డ్, ఇయాన్ కూపర్, బాసిల్ ఇవానిక్, ఎరికా లీ, క్రిస్టీన్ హేబ్లర్, అంజయ్ నాగ్పాల్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.


'మంకీ మ్యాన్' చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న యూనివర్సల్ పిక్చర్స్ వారు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే హనుమంతుడి కాన్సెప్ట్ తో వచ్చిన సూపర్ హీరో మూవీ 'హను-మాన్' బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపధ్యంలో.. ఇప్పుడు హనుమాన్ స్ఫూర్తితో రాబోతున్న 'మంకీ మ్యాన్' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Also Read: రామ్‌ చరణ్‌‌కు విలన్‌గా బాలీవుడ్‌ స్టార్ యాక్టర్?