RC 16: RRRతో గ్లోబ‌ల్ స్టార్డమ్ అందుకున్న మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ హీరోగా, ‘ఉప్పెన’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి 'RC 16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే నటీనటులకు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

 

'RC 16' సినిమాలో రామ్‌ చ‌ర‌ణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. ఇందులో ఓ కీలక పాత్రలో పాపులర్ కన్నడ హీరో శివరాజ్ కుమార్ కనిపించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం మీద సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ముందుగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ పేరు తెర మీదకు వచ్చింది.

 

హిందీలో హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన బాబీ డియోల్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ రోల్స్ తో అలరిస్తున్నారు. గతేడాది చివర్లో 'యానిమల్' మూవీలో విలన్ గా అదరగొట్టారు. ప్రస్తుతం తెలుగులో బాలయ్య - బాబీ కాంబోలో తెరకెక్కే 'NBK 109' చిత్రంలో ప్రతినాయకుడుగా నటిస్తున్నారు. అలానే పవన్ కల్యాణ్, క్రిష్ కలయికలో రాబోతున్న 'హరి హర వీరమల్లు' మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో 'RC 16'లో నెగిటివ్ క్యారక్టర్ ప్లే చేయనున్నట్లుగా టాక్ నడుస్తోంది.

 



 

అదే సమయంలో రామ్ చరణ్ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్‌ దత్‌ విలన్ గా కనిపించబోతున్నారనే మరో రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మేకర్స్ ఆయన్ని సంప్రదించారని, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చేసారని కథనాలు వెలువడుతున్నాయి. ఇంతకముందు ‘కేజీయఫ్‌ 2’, ‘లియో’ చిత్రాల్లో విలన్‌గా కనిపించిన సంజూ భాయ్.. ప్రస్తుతం రామ్‌ - పూరీ కాంబోలో రూపొందుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో నటిస్తున్నారు. ఇప్పుడు RC 16' లో కూడా విలనీ పందించనున్నారని అంటున్నారు.

 



 

ఇప్పటికైతే రామ్ చరణ్ సినిమాలో విలన్ పాత్ర గురించి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. కాకపోతే స్టార్ కాస్టింగ్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతారని తెలుస్తోంది. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కే పాన్ ఇండియా మూవీ కాబట్టి, ఇతర భాషల్లోని ప్రముఖ నటీనటులను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కథానాయికతో పాటుగా ప్రతినాయకుడిని కూడా బాలీవుడ్ నుంచి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పాత్ర కోసం బాబీ డియోల్ ను ఎంపిక చేసుకుంటారా? సంజయ్ దత్ ను ఫైనలైజ్ చేస్తారా? లేదా ఇద్దరినీ కీలక పాత్రల్లో తీసుకుంటారా? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

 

రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో RC 16 సినిమా రూపొందనుంది. ఇది ఉత్త‌రాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే రూర‌ల్, రా అండ్ ర‌స్టిక్ ఎమోషనల్ స్పోర్ట్స్‌ డ్రామా అనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బ్యానర్ పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం సమకూరుస్తుండగా.. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు కెమెరా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, ఎడిట‌ర్‌గా రూబెన్ వ‌ర్క్ చేస్తున్నారు.