నాని, సాయి పల్లవి ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలైంది. అయితే, హిందీ శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ మాత్రం బిఫోర్ యు టీవీ చానల్‌కు విక్రయించారు. సినిమా మొత్తం పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగినా.. తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. నాని, సాయి పల్లవి తమ అభినయంతో మంత్రముగ్దులను చేయడంతో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా మూడు కేటగిరిల్లో ఈ సినిమా బరిలో ఉన్నట్లు సమాచారం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్, పీరియాడిక్ ఫిల్మ్ కేటగిరిల్లో ఆస్కార్ నామినేషన్లకు పోటీపడుతోందని ప్రముఖ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ తెలిపింది. అయితే ఇప్పటివరకు దీనిపై చిత్రబృందం స్పందించలేదు. దీంతో ఈ వార్త ఎంతవరకు నిజమనే సందేహాలు నెలకొన్నాయి. పైగా ఇందులో పేర్కొన్న కేటగిరిలపై కూడాఅనుమానులున్నాయి. దీనిపై చిత్రయూనిట్ స్పందిస్తేగానీ వాస్తవం ఏమిటనేది తెలీదు.
గతేడాది డిసెంబర్‌లో విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటిషో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. కేవలం ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.13.50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మిక్కీ జే.మేయర్ సంగీత దర్శకత్వం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. వీరిద్దరితో పాటు కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు.