తమిళ మీడియాకు ఇటీవల శృతి హాసన్ (Shruti Hassan) ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిలో కమర్షియల్ సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్, మంచులో తీసే పాటల గురించి కామెంట్స్ చేశారు. వాటి మీద మెగా అభిమానులు మండి పడ్డారు. తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం విమర్శలు చేశారు. అయితే... అవి శృతి హాసన్ దృష్టికి వెళ్లినట్టు ఉన్నాయి. గురువారం రాత్రి ఆమె చేసిన ట్వీట్ చూస్తే... అదే సందేహం కలుగుతోంది. అసలు, శృతి హాసన్ ఏమన్నారు? ఇప్పుడు ఏం ట్వీట్ చేశారు? అనే విషయంలోకి వెళితే... 


తప్పుగా అర్థం చేసుకున్నారు - శృతి
''నిజం ఏమిటంటే... ఇప్పుడు నా జీవితంలోని అత్యుత్తమ దశలో ఉన్నాను. నా నటన పట్ల, నాకు వస్తున్న అవకాశాల పట్ల, నా ఎదుగుదల పట్ల, నా జీవితం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. అలాగే, నేను ఒకటి అర్థం చేసుకున్నాను. మనల్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఎప్పుడూ ఉంటుందని! అది స్థిరమైనది అని! అలాగే, ప్రేమ కూడా!'' అని శృతి హాసన్ ట్వీట్ చేశారు. దీని వెనుక ఇటీవల వచ్చిన విమర్శలు ఉన్నాయని కొందరి ఫీలింగ్. ఈ మధ్య ఆవిడ ఏమన్నారంటే...


Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?






సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya Movie ), నట సింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie)లో శ్రుతీ హాసన్ కథానాయికగా నటించారు. ఆ రెండు సినిమాల్లో నటించినందుకు సుమారు మూడు కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్నట్లు ఫిల్మ్ నగర్ గుసగుస. డబ్బు కోసం తన తండ్రి వయసు ఉన్న హీరోలతో శృతి హాసన్ నటించారని విమర్శించిన వ్యక్తులు ఉన్నారు. కన్న కుమార్తె వయసున్న అమ్మాయితో రొమాన్స్ ఏంటని హీరోలను విమర్శించిన వ్యక్తులు సైతం సోషల్ మీడియాలో కనిపించారు. 


విమర్శలను పట్టించుకోనని చెప్పిన శృతి!
హీరో హీరోయిన్ల మధ్య వయసు పరంగా వ్యత్యాసం గురించి వస్తున్న విమర్శలను తాను అసలు పట్టించుకోనని శృతి హాసన్ స్పష్టం చేశారు. తనను ప్రేక్షకులు ఇంకా చిన్న పిల్లలా చూస్తున్నందున ఆ వ్యాఖ్యలను ప్రశంసలుగా భావిస్తానని తెలిపారు. హిందీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రెండు పెద్ద సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య వయసులో వ్యత్యాసం చాలా ఉందన్నారు. లెజెండరీ హీరోలతో నటించే అవకాశం వచ్చినప్పుడు తాను ఎందుకు 'నో' చెప్పాలని శృతి హాసన్ ఎదురు ప్రశ్నించారు. విమర్శలు తనపై రావడం లేదని, చిరంజీవి గారు లేదా బాలకృష్ణ గారు లేదా తనను ఎవరూ విమర్శించడం లేదని, ఆ పాత్ర అలా రాసినందుకు దర్శకులను విమర్శిస్తున్నారు కనుక వాటికి తాను ప్రాముఖ్యత ఇవ్వనని ఆమె చెప్పేశారు. 


మంచులో తీసే పాటలు ఆపేయండి! 
చిరంజీవితో నటించడాన్ని తాను ఎంజాయ్ చేశానని చెప్పిన శృతి హాసన్... 'నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవినవుతా' పాటపై పరోక్షంగా విమర్శలు చేశారు. తనకు అటువంటి పాటలు ఎంత మాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. 


''మంచులో డ్యాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. స్నోలో డ్యాన్స్ చేయడం చాలా కష్టం కూడా! హీరోలు జాకెట్ వేసుకోవచ్చు. అయితే... హీరోయిన్లు శారీ అండ్ బ్లౌజ్ తప్ప జాకెట్, శాలువా, కోట్ వంటివి ఏవీ వేసుకోకూడదు. ఇటువంటి పాటలు తీయడం ఆపేయండి. దయచేసి నా మాటలను ఓ పిటీషన్ కింద తీసుకోండి. నేను ఇటీవల అటువంటి పాట ఒకటి చేశా. దర్శకుడి దగ్గరకు వెళ్లి నా మనసులో మాట చెప్పే ప్రయత్నం చేశా. వాళ్ళకు మంచులో పాట అంటే చాలా ఇష్టం. నేను ఏమీ చేయలేకపోయా'' అని శృతి హాసన్ పేర్కొన్నారు. 'శ్రీదేవి చిరు' పాటలో చిరంజీవి జాకెట్ వేసుకున్నారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ & శారీ మాత్రమే శృతి హాసన్ ధరించి కనిపించారు. అందువల్ల, ఆ పాటను ఉద్దేశించి శృతి హాసన్ కామెంట్స్ చేశారని చాలా మంది భావించారు. ఆమెను విమర్శించారు. బహుశా... ఆ విమర్శలపై పరోక్షంగా ఆమె ట్వీట్‌ చేశారామో!?