అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో అమిత్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓ మై గాడ్2’. పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద నామ్‌దేవ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 11న విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ విషయం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జులై 31న ఈ సినిమా సెన్సార్ కోసం మేకర్స్ బోర్డును సంప్రదించారు. ఈ సినిమాలో పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో సెన్సార్ బోర్డు సభ్యులు చాలా జాగ్రతగా సినిమాను పరిశీలించారు. చివరకు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ జారీ చేశారు.
‘ఓ మై గాడ్ 2’పై ‘ఆదిపురుష్‘ ఎఫెక్ట్
‘ఓ మై గాడ్ 2’ సెన్సార్ విషయాలను పరిశీలిస్తే ‘ఆదిపురుష్’ సినిమా ఎఫెక్ట్ కచ్చితంగా పడినట్లు అర్థం అవుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ జానకిగా నటించిన ఈ సినిమా జూన్ 16న విడుదల అయ్యింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా తీవ్ర విమర్శలపాలైంది. రామాయణాన్ని పూర్తి తప్పుదోవ పట్టించారంటూ ఆందోళనలు చెలరేగాయి. చాలా మంది ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయడంతో పాటు మేకర్స్ మీద కేసు పెట్టాలని కోర్టుకెక్కారు. కోర్టులు సైతం సెన్సార్ బోర్డు తీరును ప్రశ్నించాయి. ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో ‘ఓ మై గాడ్ 2’ విషయంలో సెన్సార్ బోర్డు సభ్యులు ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ఫ్రేమ్ టు ఫ్రేమ్ పరిశీలించి చూడటంతో పాటు రివ్యూ కమిటీకి సిఫార్సు చేయడం సంచలనం కలిగించింది. చివరకు సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేకాదు, ఏకంగా 27 మార్పులు కూడా సూచించింది. ముందు తీసిన సినిమా నుంచి 13.51 నిమిషాలు డిలీట్ చేశారు. ఆ సన్నివేశాల స్థానంలో కొత్తగా తీసిన 14.01 నిమిషాలు యాడ్ చేశారు. అంతేకాదు.. అక్షయ్ పాత్రను దేవుడిగా కాకుండా, దేవదూతగా చూపించాలనే సూచన చేసినట్టు తెలుస్తోంది.
ఇకపై దేవుడి పాత్రలు చేయడం కుదరదా?
‘ఆదిపురుష్’ విషయంలో ప్రభాస్ రాముడి క్యారెక్టర్ మీద, ‘ఓ మై గాడ్2’లో అక్షయ్ కుమార్ శివుడి పాత్రపై జరిగిన, జరుగుతున్న రచ్చ నేపథ్యంలో సినిమాల్లో దేవుడి పాత్రలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అటు ఫిల్మ్ మేకర్స్ సైతం దేవుడి పాత్రలు సినిమాల్లో పెట్టకపోవడమే మంచిదని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ‘ఆదిపురుష్’, ‘ఓ మై గాడ్ 2’ చిత్రాలు మేకర్స్ ను భయపెట్టాయని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
Read Also: ‘కొటేషన్ గ్యాంగ్’ ట్రైలర్ - ‘దండుపాళ్యం’ గ్యాంగ్‌ను మించిపోయిన ప్రియమణి, సన్నీలియోన్ ముఠా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial