Shehzada Movie: సినిమా ఇండస్ట్రీలో ఓ భాషలోని సినిమాను మరో భాషలో రీమేక్ చేస్తూ ఉంటారు. అయితే ఆ సినిమాల్లో కొన్ని హిట్ అందుకుంటాయి కొన్ని నిరాశపరుస్తాయి. అలా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను హిందీలో ‘షెహజాదా’గా రీమేక్ చేశాడు దర్శకుడు రోహిత్ ధావన్. ఈ సినిమా హిందీలో దారుణంగా నష్టపోయింది. మొదటి రోజే ఫ్లాప్ టాక రావడంతో మూవీకు రావాల్సిన వసూళ్లు కూడా రాలేదు. దీందో ఈ సినిమా కోసం పనిచేసిన కొంత మంది సిబ్బందికి దాదాపు రూ. 30 లక్షలు చెల్లింపులు నిలిచిపోయాయనే వార్త ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశమవుతుంది. 


విడుదలై నాలుగు నెలలైనా ఇవ్వలేదు..


సాధారణంగా ఒక సినిమా విడుదల అయిన తర్వాత సుమారు 60 నుంచి 90 రోజుల్లో ఆ సినిమాకు పని చేసిన అందరికీ చెల్లింపులను క్లియర్ చేయాలనేది ఇండస్ట్రీలో పెట్టుకున్న ఒక నియమం. అయితే ‘షెహజాదా’ విడుదల అయి దాదాపు నాలుగు నెలలు దాటినా కూడా ఈ సినిమాకు పనిచేసిన సిబ్బంది అలాగే విక్రేతలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదని మూవీ యూనిట్ లో కొంతమంది సిబ్బంది వాపోతున్నారట. ఇది ఇండస్ట్రీ ప్రమాణాలకు విరుద్దమని కొంత మంది ఆరోపిస్తున్నారట. ఇలా చేస్తే సినిమా నిర్మాతలపై నమ్మకం పోతుందని, నిర్మాతలు ఈ విషయాన్ని గమనించాలని అంటున్నారట. 


సంక్షోభంలో బాలీవుడ్..


బాలీవుడ్ లో కొన్నేళ్ల నుంచి సరైన సినిమాలు ఏమీ రాలేదు. కొన్ని సినిమాలు మాత్రమే ఆశించిన ఫలితాలు పొందాయి. దీంతో బాలీవుడ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘షెహజాదా’ సినిమా కూడా చెల్లింపులలో బకాయిలు పెట్టవలసి వచ్చిందని చెబుతున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమాకు సంబంధించి చెల్లింపులు దాదాపు పూర్తి చేశామని, అయితే కొన్ని బిల్లులు టెక్నికల్ సమస్యల కారణంగా ఆలస్యం అయ్యాయని త్వరలోనే వాటిని కూడా క్లియర్ చేస్తామని హామి ఇచ్చారట. ఏదేమైనా ‘షెహజాదా’ సినిమా చెల్లింపుల అంశం ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశమవుతుంది. మరి మిగిలిన చెల్లింపులను సిబ్బందికి చెల్లిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. 


‘అల వైకుంఠపురములో’ మూవీకు రీమేక్ గా వచ్చి..


టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. దీంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశాడు దర్శకుడు రోహిత్ ధావన్. ఈ మూవీలో హీరోగా కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ గా కృతి సనన్ నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో భారీ అంచనాల మధ్య మూవీను విడుదల చేశారు మేకర్స్. అయితే తెలుగులో ఆకట్టుకున్నంతగా ఈ సినిమా హిందీ లో మెప్పించలేకపోయింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాను అల్లు అర్జున్ స్టైల్ తో సహా మక్కీకి మక్కీ దించేశారనే టాక్ రావడంతో తొలిరోజే ఈ సినిమా కలెక్షన్లకు గండిపడింది. దీంతో మూవీ అక్కడ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీను అల్లు అరవింద్ సమర్పణలో టీ-సిరీస్‌ ఫిలిమ్స్‌, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌, బ్రాట్ ఫిలిమ్స్‌, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై నిర్మించారు.