Shatrughan Sinha hospitalized : బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ముంబయి లోని కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్ లో చేర్పించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఇంట్లో టీవీ చూస్తూ తూలిపోయారని, ఆ తర్వాత తీవ్రమైన జ్వరం, పక్కటెముకల్లో నొప్పులు తీవ్ర అవ్వడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయం మాత్రం వెల్లడించలేదు.
సోఫాలో కూర్చుని..
శత్రుఘ్న సిన్హా ఇంట్లోని తనకు ఇష్టమైన సోఫాలో కూర్చుని టీవీ చూస్తుండగా.. ఒక్కసారిగా పడబోయారని, వెంటనే సోనాక్షి సిన్హా ఆయన్ను కిందపడకుండా పట్టుకున్నారని ఆయనకు అత్యంత సన్నిహితులు మీడియాతో చెప్పారు. అది జరిగిన రోజంతా ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారని, ఆ తర్వాత జ్వరం, పక్కటెముకల్లో నొప్పులు రావడంతో డాక్టర్లు హాస్పిటల్ కి తరలించాలని సూచించడంతో హాస్పిటల్ కి తరలించినట్లు చెప్పారు. రొటీన్ టెస్ట్ లు చేసిన డాక్టర్లు సోమవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పినట్లు కూడా కుటుంబసభ్యుల్లో ఒకరు మీడియాకి వెల్లడించారు.
ఎలక్షన్లు, పెళ్లి పనులు..
శత్రుఘ్న సిన్హా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. గత కొద్ది రోజులుగా ఎలక్షన్లు, సమావేశాల్లో బిజీగా, రెస్ట్ లేకుండా గడిపారు ఆయన. ఇక ఇటీవల ఆయన కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ని వివాహం చేసుకున్నారు. దీంతో ఆ పెళ్లి పనుల్లో కూడా బిజీగా గడిపారు శత్రుఘ్న సిన్హా. దీంతో 77 వయసులో రెస్ట్ లేకుండా, బిజీబీజీగా ఉండటంతో కొంచెం ఆరోగ్యం దెబ్బతినిందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
హాస్పిటల్ కు వెళ్లిన సోనాక్షి దంపతులు..
ఇక కొత్త దంపతులు సోనాక్షి సిన్హా, ఇక్బాల్ ఇద్దరు ముంబైలోని హాస్పిటల్ కి వచ్చి శత్రుఘ్న సిన్హాని పరామర్శించారు. దీంతో ఆ విషయంపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. పెళ్లైన వారం రోజులకే సోనాక్షి ప్రెగ్నెసీ టెస్ట్ లకు వచ్చిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. ఇదిలా ఉంటే.. శత్రుఘ్న ఆరోగ్యంపై కొడుకు లవ్ సిన్హా కూడా స్పందించారు. తీవ్ర జ్వరం, జనరల్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరినట్లు క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి ఆపరేషన్ లాంటివి జరగలేదని చెప్పుకొచ్చారు ఆయన.
మరోవైపు సోనాక్షి పెళ్లిపై కూడా చాలా విమర్శలు తలెత్తాయి. హిందూ అమ్మాయి ముస్లింని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ ట్రోల్ చేశారు. పెళ్లి తర్వాత సోనాక్షి మతం మారుతుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. దీంతో సోనాక్షి సిన్హా ఇక్బాల్ ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్స్ సెక్షన్ ని కూడా డిజేబుల్ చేశారు. ఇక ఇక్బాల్ ని పెళ్లి చేసుకోవడం తన తండ్రి శత్రుఘ్న సిన్హాకి, కుటుంబసభ్యులకు కూడా ఇష్టం లేదనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. కానీ, ఆ వార్తలన్నీ నిజం కాదన్నట్లుగా ఆమె కుటుంబసభ్యులంతా పెళ్లికి హాజరయ్యారు.
Also Read: రేజినా హాట్ లుక్, వర్షబొల్లమ్మ క్యూట్ స్మైల్, సిమ్రాన్ చౌదరి డ్యాన్స్