Trending
Shalini Pandey: 'అర్జున్ రెడ్డి' హీరోయిన్‌ది పబ్లిసిటీ స్టంటా? సడన్‌గా సౌత్ డైరెక్టర్‌పై కామెంట్స్ ఎందుకు?
Shalini Pandey Viral Comments: వ్యానిటీ వ్యాన్‌లో డ్రస్ ఛేంజ్ చేసుకుంటున్న సమయంలో దర్శకుడు డోర్ ఓపెన్ చేశాడని, తాను గట్టిగా అరిచేశానని శాలినీ పాండే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అవకాశాల కోసం సౌత్ సినిమాలు చేయడం హిందీ సినిమాలలో ఛాన్సులు వచ్చిన తర్వాత సౌత్ ఫిలిం మేకర్స్ మీద కామెంట్స్ చేయడం కొంత మంది నార్త్ ఇండియన్ అమ్మాయిలకు ఫ్యాషన్ అయిపోయిందని టాలీవుడ్ జనాలు కించిత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ శాలిని పాండే వ్యవహార శైలి ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఓ హిందీ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆవిడ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం.
డ్రెస్ చేంజ్ చేస్తున్నా...
తలుపు కట్టకుండా ఓపెన్ చేశారు!
నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్'లో శాలినీ పాండే ఒక క్యారెక్టర్ చేశారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో కెరీర్ ప్రారంభంలో సౌత్ సినిమా చేస్తున్నప్పుడు తనకు ఒక చేదు అనుభవం ఎదురైందని ఆవిడ చెప్పుకొవచ్చారు.
''నేను వానిటీ వ్యాన్ లోపల డ్రస్ చేంజ్ చేసుకుంటున్నాను. సడన్ గా దర్శకుడు వచ్చి డోర్ ఓపెన్ చేశారు. అప్పుడు నా వయసు 22 సంవత్సరాలే. ఒక్క సినిమా మాత్రమే చేశాను. తలుపు తట్టకుండా అలా వ్యాన్ లోపలికి వచ్చేసరికి ఏం చేయాలో తెలియలేదు. గట్టిగా అరిచేశా'' అని శాలిని పాండే చెప్పారు. సాధారణంగా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మాయిలకు ఎవరి మీద కోపం చూపించవద్దని అందరితో మంచిగా నడుచుకోవాలని చెబుతారని, కానీ ఆ సమయంలో తనకు అనిపించినది చేసేశానని శాలిని పాండే తెలిపారు.
'అర్జున్ రెడ్డి' తర్వాత...
శాలిని చేసిన సినిమాలు ఏమిటి?
విజయ్ దేవరకొండకు హీరోగా గుర్తింపుతో పాటు ప్రేక్షకులలో ఇమేజ్ తీసుకు వచ్చిన సినిమా 'అర్జున్ రెడ్డి'. అందులో శాలిని పాండే హీరోయిన్. సౌత్ సినిమా, హిందీ సినిమా అని కాదు... ఆవిడ హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా అది. దాని తర్వాత హిందీలో ఒక సినిమాలో నటించారు. ఆ తరువాత సావిత్రి జీవిత కథ ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి'లో ఒక కీలక పాత్ర చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించిన 'యన్.టి.ఆర్' బయోపిక్ కూడా చేశారు.
'మహానటి'... 'యన్.టి.ఆర్' బయోపిక్... 'అర్జున్ రెడ్డి' తర్వాత శాలిని పాండే చేసిన తెలుగు సినిమాలు. ఒక్కోసారి ఒక సినిమా ముందుగా సెట్స్ మీదకు వెళ్ళినా సరే... దానికంటే తర్వాత సెట్స్ మీదకు వెళ్ళిన సినిమా తర్వాత విడుదల కావచ్చు. శాలిని పాండే చాలా తెలివిగా తన ఇంటర్వ్యూలో ఏ సినిమా దర్శకుడు తన పట్ల తప్పుగా ప్రవర్తించాడనేది చెప్పలేదు. కానీ తన రెండో సౌత్ సినిమా చేస్తున్నప్పుడు అని మాత్రం చెప్పారు. దాంతో ఆడియన్స్ అందరూ శాలిని పాండే వికీపీడియా పేజీ ఓపెన్ చేసి అవాక్కయ్యారు.
Also Read: జీవీతో డేటింగ్... మరోసారి బాంబు పేల్చిన దివ్యభారతి
తెలుగు సినిమా పరిశ్రమ, ప్రేక్షకులలో మాత్రమే కాదు... హిందీ చిత్రసీమతో పాటు అక్కడి ప్రేక్షకులలో సైతం 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్, 'యన్.టి.ఆర్' బయోపిక్ దర్శకుడు జాగర్లమూడి అంటే గౌరవం ఉంది. విద్యా బాలన్, దీపికా పదుకోన్ వంటి హీరోయిన్లతో పాటు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు ఆ ఇద్దరితో పని చేశారు. అటువంటి దర్శకుల మీద శాలిని పాండే విమర్శలు చేయడంతో పబ్లిసిటీ స్టంట్ అని టాలీవుడ్ జనాలు కొట్టి పారేస్తున్నారు. హిందీలో ఆవిడ వ్యాఖ్యలకు ప్రచారం లభిస్తుందేమో కానీ... తెలుగులో మాత్రం లైట్ తీసుకుంటున్నారు.
Also Read: మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా బావుందా? లేదా?