400 acre Lands Auction |హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. అటవీ భూమిని నాశనం చేసి, వన్య మృగాలకు ఆవాసం లేకుండా చేస్తారా అని ప్రజా సంఘాలు, జంతు ప్రేమికులు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హెచ్‌సీయూతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సైతం ఈ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా సెలబ్రిటీలు గళం విప్పుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటి, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తెలంగాణ ప్రభుత్వానికి ఓ రిక్వెస్ట్ చేశారు.
నాకు 44 ఏళ్లు.. ఇంకా ఏమీ ఆశించడం లేదు..
400 ఎకరాల భూమి ఎంతో ఆక్సిజన్ ఇస్తోందని, ఆ అటవీ భూములను అలాగే వదిలేయాలని రేణు దేశాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. వీలైతే సీఎం రేవంత్ రెడ్డి ఆ భూములు కాకుండా వేరే చోట డెవలప్ మెంట్ చేయాలని కోరారు. ఓ తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన పిల్లలకు ఆక్సిజన్, ప్రకృతి వనరులు కావాలి. మనం కొన్నేళ్లలో ఎలాగూ చచ్చిపోతాం. కానీ భవిష్యత్ తరాలకు ఇలాంటి ప్రకృతిని దూరం చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డికి రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు. నాకంటే మీకు ఎక్కువ తెలుసు, ఎంతో అనుభం ఉంది. మరోసారి ఈ భూముల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరుతూ ఓ వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. ఇప్పుడు నాకు 44 ఏళ్లు ఇంకా ఏమీ ఆశించడం లేదు, తల్లిగా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, ఆక్సిజన్, నీళ్లు ఉండాలని కోరుకుంటున్నానని వీడియోలో తెలిపారు. కొందరు స్నేహితులు ఈ అంశంపై వీడియో చేయవద్దని చెబుతున్నా, ఓ తల్లిగా వీడియో చేయాల్సి వచ్చిందన్నారు రేణు దేశాయ్.
రేణు దేశాయ్ వీడియో పోస్టులో ఏముందంటే..నమస్కారం, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది ప్రజల నుంచి హృదయపూర్వక రిక్వెస్ట్. హెచ్‌సీయూ భూముల వివాదం గురించి తెలిసింది. ఓ తల్లిగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఎలాగూ 44 ఏళ్లు. త్వరలోనే నేను పోతానని తెలుసు. కానీ మన పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలి. వాళ్లకు విద్య, నీళ్లు, ఆక్సిజన్ కావాలి. అభివృద్ధి కావాలి. ఐటీ పార్కులు, ఎత్తైన భవనాలు మనకు అవసరమే. కానీ ఈ 400 ఎకరాల భూమిని మాత్రం వదిలేయండి. ఎన్నో వృధాగా ఉన్న భూములు మనకు ఉన్నాయి.
మీరు మనసు పెడితే ఆ భూములు కాకుండా, వేరే చోట అభివృద్ధి చేయండి. ఈ వయసులో నేను ఏమీ ఆశించడం లేదు. మీ ముందు నేను ఎంతో కాదు. ఒక్కసారి ఈ విషయంపై ఆలోచించండి. ఎకో సిస్టమ్ ను కాపాడండి. ఆక్సిజన్, చెట్లు, పర్యావరణం కావాలి. మీరు దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని ఓ తల్లిగా హృదయపూర్వకంగా రిక్వె్స్ట్ చేస్తున్నారు. మంత్రులు, అధికారులు, ప్రభుత్వం మరోసారి ఆలోచించి ఆ భూమిని మాత్రం వదిలేసి.. మరోచోట అభివృద్ధికి ఆస్కారం ఉంటుందేమో చూడాలని ఓ తల్లిగా కోరుతున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.