మామూలుగా తమ సినిమా విడుదల అవుతుంది అనగానే ప్రతీ యాక్టర్‌కు ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలా చేస్తే తమ సినిమా హిట్ అవుతుంది అని నమ్మకం ఉంటుంది. అలాగే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు కూడా ఉంది. ఇప్పటికే 2023లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. రెండిటితోనూ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు షారుఖ్. ఇప్పుడు ఈ ఏడాదిలోనే తన మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. ఇదే సందర్భంగా తన ఇష్టదైవాన్ని సందర్శించుకోవడానికి వెళ్లాడు ఈ సీనియర్ హీరో. తన ప్రతీ సినిమా రిలీజ్‌కు ముందు ఇలా చేయడం షారుఖ్‌కు అలవాటని తెలుస్తోంది.
జమ్మూకి షారుఖ్..
షారుఖ్ ఖాన్.. ఇటీవల వైష్ణో దేవీ ఆలయాన్ని సందర్శించుకున్నాడు. షారుఖ్ ఈ ఆలయానికి వెళ్లడం.. ఈ ఏడాదిలో ఇది మూడోసారి. చూస్తుంటే తన ప్రతీ సినిమా విడుదలకు ముందు ఆ ఆలయానికి వెళ్లడం అలవాటుగా మార్చుకున్నట్టున్నాడు బాలీవుడ్ బాద్‌షా. అంతే కాకుండా అలా చేసిన ప్రతీసారి తన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్నాయి కూడా. తాజాగా జమ్మూలోని వైష్ణో దేవీ ఆలయాన్ని షారుఖ్ సందర్శించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన బాడీగార్డ్స్, మ్యానేజర్స్‌తో కలిసి ఈ గుడికి వెళ్లాడు షారుఖ్. తన మ్యానేజర్ పూజా దడ్లానీ కూడా తనతోనే ఉంది. బ్లాక్ జాకెట్‌లో హుడీ వేసుకొని స్టైలిష్‌గా కనిపించాడు ఈ హీరో.
‘సలార్’కు పోటీగా ‘డంకీ’..
ఇక షారుఖ్ ఖాన్ ఆలయ సందర్శన.. తన తరువాతి సినిమా ‘డంకీ’ కోసమే అని ప్రేక్షకులకు అర్థమయ్యింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్, తాప్సీ లీడ్ రోల్స్ చేసిన ‘డంకీ’.. డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తన కథ మీద ఉన్న నమ్మకంతో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్’లాంటి యాక్షన్ సినిమాతో తలపడడానికి వెనకాడడం లేదు షారుఖ్. ఒకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ కూడా డిసెంబర్ 21న విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘డంకీ’ను కూడా ‘సలార్’కు ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్‌లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా..
ఇప్పటికే ‘డంకీ’ సినిమాకు సంబంధించిన ట్రైలర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. షారుఖ్ మునుపటి సినిమాలా ఇదొక పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా కాదు. ఇందులో రాజ్‌కుమార్ హిరానీ స్టైల్‌లో ఒక మెసేజ కూడా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇది ఫారిన్ వెళ్లాలనుకొని కలలు కనే నలుగురు స్నేహితుల కథ. ఇది పలు నిజ జీవిత సంఘటనలపై ఆధారపడి తెరకెక్కిన చిత్రమని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. బోమన్ ఇరానీ, విక్రమ్ కోచర్, అనిల్ గ్రోవర్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ ప్రజెంటేషన్ కలిసి ‘డంకీ’ని సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఇందులో షారుఖ్ ఖాన్ కూడా యాక్టివ్‌గా పాల్గొనాలనే ఆలోచనలో ఉన్నారట.
Also Read: ‘సలార్’ మూవీలో ‘కేజీఎఫ్‘ హీరో యష్? అసలు సంగతి ఇదీ!