సినిమాల్లో అవకాశం వస్తే నటీనటులు ఒక్కొక్కసారి తమ ఇగోను పక్కన పెట్టాల్సి ఉంటుంది. టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం లేకపోవడం వల్ల చాలామంది యాక్టర్స్‌కు అవకాశాలు దక్కక.. మెల్లగా ఇండస్ట్రీ నుంచి ఫేడవుట్ అయిపోతున్నారు. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ కూడా అదే పరిస్థితిలో ఉంది. అందుకే తన ఇగోను పక్కన పెట్టి మరీ తన యాక్టింగ్ బాగుంటుందని, చూసి తనకు ఒక రోల్ ఇవ్వమని ఓపెన్‌గా రిక్వెస్ట్ చేసింది. హీరోయిన్‌గా తెలుగులో గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన తర్వాత పాయల్ రాజ్‌పుత్‌కు లక్ కలిసిరాలేదు. తాజాగా ‘మంగళవారం’తో హిట్ కొట్టినా.. తనకు అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే పాయల్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.


‘Kantara Chapter 1’ కోసం ఆడిషన్స్..
కేవలం కన్నడలో మాత్రమే తెరకెక్కి.. ఆ తర్వాత ప్రేక్షకుల్లో వచ్చిన రెస్పాన్స్‌తో సౌత్ భాషలు అన్నింటిలో డబ్ అయిన చిత్రం ‘కాంతార’. ఈ మూవీ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకోవడంతో దీని ప్రీక్వెల్‌ను భారీ రేంజ్‌లో ప్లాన్ చేశాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ‘Kantara Chapter 1’ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని, షూటింగ్ ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో ‘Kantara Chapter 1’లో నటించడానికి నటీనటులు కావాలని, ఆడిషన్స్ జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ పోస్ట్‌కు నటి పాయల్ రాజ్‌పుత్ స్పందించింది. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమవ్వాలని చాలామంది నటీనటులకు కోరిక ఉంటుంది. కానీ పాయల్ మాత్రం ఆ కోరికను ఓపెన్‌గా బయటపెట్టింది.


రిషబ్ శెట్టికి రిక్వెస్ట్..
రిషబ్ శెట్టిని, ‘Kantara Chapter 1’ను నిర్మిస్తున్న హోంబేల్ ఫిల్మ్స్ బ్యానర్‌ను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది పాయల్. ‘కాంతార చాప్టర్ 1’కు ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఈ గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమవ్వడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా తాజా చిత్రం ‘మంగళవారం’లో నా పర్ఫార్మెన్స్‌కు మంచి ఆదరణ దక్కించుకున్నాను. మీరు కాస్త వీలు చూసుకొని సినిమా చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఆడిషన్ ఎలా చేయాలో తెలియజేయండి. ఈ ట్వీట్‌ను రీపోస్ట్ చేసి, నన్ను ముందుకు నడిపించిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’ అంటూ పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది.






పాయల్‌కు సపోర్ట్..
పాయల్ రాజ్‌పుత్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. టాలెంట్ ఉన్న హీరోయిన్ అయినా కూడా అవకాశాలు లేకపోవడంతో పాయల్ ఇలా చేయవలసి వచ్చిందని కొందరు అనుకుంటున్నా.. అందరూ ఇలా అడగలేరని, అడగడంలో తప్పేముంది అని చాలామంది ఫ్యాన్స్ తనకు సపోర్ట్ చేస్తున్నారు. తనకు అవకాశాలు వస్తాయని, దిగులుపడొద్దని ధైర్యం చెప్తున్నారు. ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో తను నటించిన ‘మంగళవారం’ సినిమా చూసిన వారు అయితే.. ‘కాంతార చాప్టర్ 1’లాంటి కథకు పాయల్ సరిగ్గా సరిపోతుందని సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తర్వాత వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతో కూడా జోడీకట్టింది పాయల్. అయినా కూడా తన డెబ్యూలాగా మళ్లీ హిట్ అందుకోలేకపోయింది. 


Also Read: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం