ఇటీవల కాలంలో పెరుగుతున్న టెక్నాలజీతో పాటు రోజురోజుకూ సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. మొదట్లో పెద్దగా చదువుకోని వారిని... గ్రామీణ ప్రాంతాల వారిని లక్ష్యంగా పెట్టుకున్న సైబర్ కేటుగాళ్లు... ఇప్పుడు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. ఈ మధ్య కాలంలో పలువురు సెలబ్రిటీలు తాము సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయామంటూ లబోదిబోమన్నారు. ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయిన ప్రముఖుల జాబితాలో సీనియర్ హీరోయిన్‌ నగ్మ చేరారు. బ్యాంక్ అధికారులమంటూ ఆమెను బురిడీ కొట్టించారు. సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో చిక్కిన నగ్మ రూ.లక్ష పోగొట్టుకున్నారు.   


ఎలా బురిడీ కొట్టించారంటే..


ఫిబ్రవరి 28న నగ్మ మొబైల్ కు బ్యాంక్ అధికారులు పంపినట్లుగా ఒక మెసేజ్ వచ్చిందట. ఆ లింక్‌ పై క్లిక్ చేసిన వెంటనే ఒక వ్యక్తి కాల్‌ చేశాడట. తాను బ్యాంక్ ఉద్యోగినంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి... కేవైసీ అప్‌డేట్‌ చేయాల్సిందిగా కోరాడట. నగ్మ బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పనప్పటికీ అతడు ఆన్ లైన్ బ్యాంక్ లాగిన్ అయ్యి బెనిఫిషరీ అకౌంట్ ను క్రియేట్‌ చేసుకుని వెంటనే రూ.లక్షను ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడట. ఆ సమయంలో తన ఫోన్‌ కు 20 సార్లు ఓటీపీ వచ్చిందని.. ఆ ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అతడికి చెప్పలేదని నగ్మ తెలిపారు. అయినా కూడా తన బ్యాంక్‌ ఖాతా నుంచి లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసుకోగలిగాడని పేర్కొన్నారు. కేవలం నగ్మా మాత్రమే కాదు.. అదే బ్యాంక్‌ కు చెందిన మరో 80 మంది ఖాతాదారులు కూడా ఇదే తరహా సైబర్‌ మోసానికి బలయ్యారని తెలిసింది.


తస్మాత్ జాగ్రత్త...


చదువుకున్న వారు... అన్ని విషయాలు తెలిసిన వారు కూడా అప్పుడప్పుడు ఏమరపాటుగా ఉండడం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఓటీపీ చెప్పకపోయినా.. బ్యాంక్‌ ఖాతా వివరాలు తెలియజేయకపోయినా కూడా కేవలం మోసగాళ్ల నుంచి వస్తున్న లింక్ లను క్లిక్ చేస్తే చాలు వారి వలలో చిక్కినట్లేనని నగ్మ ఉదంతంను చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి సంఘటనల తర్వాత అయినా ఫేక్ మెసేజ్ లు కేవైసీ మోసాల నుంచి సామాన్యులు, సెలబ్రెటీలు జాగ్రత్తగా ఉండాలని బ్యాంకర్స్ హెచ్చరిస్తున్నారు. 


Read Also: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన హిట్, ఫ్లాప్ మూవీస్ ఇవే? బన్నీ ఫ్యాన్స్ షాకవ్వడం పక్కా! 


హీరోయిన్ గా నగ్మ తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ గా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం నగ్మ సినిమాలకు దూరంగా ఉన్నారు. రీ ఎంట్రీకి అవకాశాలు వస్తున్నా.. రాజకీయాల్లో స్థిరపడే ప్రయత్నాల్లో ఉండటం వల్ల ఆసక్తి  చూపడం లేదని తెలుస్తోంది. అయితే, త్వరలోనే ఆమె తమిళ్ లేదా తెలుగు సినిమాల్లో కనిపిస్తారని తెలుస్తోంది.


సుదీర్ఘ కాలంగా నగ్మ ఇలాంటి మోసాల గురించి వింటూ, చూస్తూనే ఉన్నారు. అలాంటి నగ్మ ఇలా సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉందని అభిమానులు అంటున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది.