Senior Actor Naresh About PawanKalyan: సీనియర్ నటుడు నరేష్ ఎన్నో సినిమాలు చేశారు. ఎన్నో మంచి మంచి క్యారెక్ట‌ర్ల‌లో న‌టించారు. ఆయ‌న‌కు రాజ‌కీయంగా కూడా కొంత అనుభ‌వం ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇటీవ‌ల ఏపీ ఎన్నిక‌ల టైంలో ఆయ‌న ప‌వ‌న్ కళ్యాణ్ మీద ఒక ట్వీట్ చేశారు. కృష్ణ గారి గురించి మాట్లాడొద్దు అంటూ విమ‌ర్శించారు. ఇప్పుడు ప‌వ‌న్ కళ్యాణ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు నరేష్. ప‌వ‌న్ కళ్యాణ్ డైన‌మిక్ అని, ఆయ‌న లాంటి వాళ్లు రాజ‌కీయాల్లో ఉండాల‌ని చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ప‌వ‌న్ గురించి చెప్పారు. 


ప‌వ‌న్ కళ్యాణ్ నేను చాలా క్లోజ్... 


ప‌వ‌న్ కళ్యాణ్ గురించి అప్పుడు అలా ట్వీట్ చేశారు? మ‌ళ్లీ ఆయ‌న‌కు స‌పోర్ట్ ఇవ్వ‌డానికి కార‌ణం ఏంటి అని అడిగిన ప్ర‌శ్న‌కి నరేష్ ఇలా స‌మాధానం చెప్పారు. "ఫ్రాంక్ గా ఉండే వాళ్లంటే నాకు చాలా ఇష్టం. బోల్డ్, డైన‌మిక్, మ‌న‌సుతో మాట్లాడే వాళ్లను ఇష్ట‌ప‌డ‌తాను ఎప్పుడూ. చెన్నైలో ప‌వ‌న్ కళ్యాణ్, మేము ప‌క్క ప‌క్క‌న ఉండేవాళ్లం . అప్ప‌టి నుంచే ప‌రిచ‌యం మాకు. మొన్న కూడా ఫంక్ష‌న్ లో క‌లిశాం. మేమిద్దరం చాలా క్లోజ్ అని చెప్పారు ఆయ‌న‌. రెండోది ఏంటంటే? ప‌ద‌వి ఆశించి రాజ‌కీయాల్లోకి వెళ్ల‌లేదు ఆయ‌న‌. ఏమీ లేన‌ప్పుడే పీపుల్స్ఆర్మీ అని పెట్టి కొన్ని కోట్లు ఇచ్చారు ఆయ‌న‌. ఇవ‌న్నీ దేనికోసం చేశారు? ఆయ‌న‌లో ఉన్న క‌సి. ఏదో చేయాల‌నే త‌ప‌న. రామారావు గారి త‌ర్వాత అంత ద‌మ్ము ఉండి, నిల‌బ‌డి ఉన్న నాయ‌కుడు ప‌వ‌న్ కళ్యాణ్. ఫెయిల్యూర్స్ ఉన్న‌ప్ప‌టికీ వెళ్లిపోకుండా, పారిపోకుండా నిల‌బ‌డి ముందుకు వెళ్లి, వారాహితో జ‌నాల్లోకి వెళ్లాడు. మాములు పోరాటం కాదు అది" అని నరేష్ చెప్పారు. 


ఇండ‌స్ట్రీ వాళ్లు చాలా అవ‌మాన‌ప‌డ్డాం.. 


"ఇండ‌స్ట్రీకి గ‌తంలో చాలా అవ‌మానాలు జరిగాయి. అవి అంద‌రి మ‌న‌సులు తొలిచేశాయి. ప‌వ‌న్ కళ్యాణ్ మ‌న‌సు, నా మ‌న‌సు కూడా. ఇండ‌స్ట్రీ నుంచి ఒక దీక్ష‌తో వెళ్లిన ఆ మ‌నిషి ఈ రోజు పాలిటిక్స్ లోస‌క్సెస్ అవుతున్నాడు. నా స‌పోర్ట్ ఆయ‌న‌కే. నా స‌పోర్ట్ తో ఆయ‌నేదో గెలుస్తాడు అని నేను అనుకోను. మోర‌ల్ గా స‌పోర్ట్ ఇస్తున్నాను. ఇండ‌స్ట్రీ మొత్తం ఆయ‌న‌కు స‌పోర్ట్ గా ఉండాలి. క‌మిట్ మెంట్ తో ఉన్న‌వ్య‌క్తి ఆయ‌న ఒక్క‌రే క‌దా. అందుకే, స‌పోర్ట్ చేస్తున్నాను." 


ఆ ట్వీట్ అందుకే చేశాను..  


"కృష్ణ గారిని ఆయ‌న అనాల‌ని అన‌లేదు. మొత్తం వింటే అర్థం అవుతుంది. కానీ, అది వైర‌ల్ అయ్యింది. ప‌వ‌న్ కళ్యాణ్ గారికి మంచి చేయాల‌నే ఆ రోజు అలా ట్వీట్ పెట్టాను. ద‌య‌చేసి అని పెట్టాను. కృష్ణ గారి పేరు తియొద్దు అని పెట్టాను. కానీ, ఆ త‌ర్వాత న‌న్ను నేను ప్ర‌శ్నించుకున్నాను. ఏమైనా త‌ప్పు అన్నానా? అని. కృష్ణ గారి గురించి తియొద్దు అని అన్నాను అంతే. కానీ, నేను ఆయ‌న్ను స‌పోర్ట్ చేస్తున్నాను. సినిమా వాళ్లు రాజకీయాల్లో ఉండాలి. ఆయ‌న‌కు ఉన్న ఫోర్స్, ఆయ‌న‌కు ఉన్న యూత్ ఆంధ్రాకి కావాలి. ఆయ‌న నిల‌బ‌డాలి" అని ప‌వ‌న్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చారు నరేష్. 


Also Read: సూపర్ స్టార్ కృష్ణ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు - అందుకే ఆయన లెజెండ్!