సత్యదేవ్ తనను తాను ఒక ఇమేజ్ ఛట్రంలో బందించుకోవడం లేదు. ఒకవైపు కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు 'గాడ్ ఫాదర్'లో విలన్ రోల్ చేశారు. తాజాగా విడుదలైన 'కింగ్‌డమ్‌'లో విజయ్ దేవరకొండకు అన్నయ్యగా నటించారు. ఆ సినిమాలో ఆయన పాత్ర, నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా 'కింగ్‌డమ్'లో క్యారెక్టర్, తదుపరి సినిమా గురించి సత్యదేవ్ (Satyadev Interview)తో ఇంటర్వ్యూ... 

కంగ్రాచ్యులేషన్స్ సత్యదేవ్ గారు...థాంక్యూ అండీ!  

'కింగ్‌డమ్' విడుదల తర్వాత మీకు ఎటువంటి స్పందన లభించింది?విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా గురించి నన్ను అప్రిషియేట్ చేయడానికి వచ్చిన ఫోన్స్ ఇంతకు ముందు రాలేదు. దర్శకుడు గౌతమ్ నాకు 'కింగ్‌డమ్' కథ చెప్పిన వెంటనే ఎటువంటి లెక్కలు వేసుకోకుండా ఓకే చేశా. ఈ కథ, అందులో నా క్యారెక్టర్ నాకు అంత నచ్చాయి. 'బ్లఫ్ మాస్టర్'కు నాకు పేరు వచ్చింది. కానీ, అది ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి సమయం పట్టింది. 'కింగ్‌డమ్'కు వస్తే... విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్, భారీతనం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. హ్యాపీ!

మీకు వచ్చిన అత్యుత్తమ ప్రశంస?ఒక్కరు అని కాదు... చాలా మంది అప్రిషియేట్ చేశారు. ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేశారు. అభినందించారు.

'కింగ్‌డమ్' కథ చెప్పినప్పుడు మీ ఫీలింగ్?శివ పాత్ర కోసం మొదట గౌతమ్ తిన్ననూరి నా పేరే రాసుకున్నారట. కానీ, ఏవో కారణాల వల్ల నన్ను అప్రోచ్ కాలేదు. మధ్యలో వేర్వేరు నటులను అనుకున్నా... సరిగ్గా చిత్రీకరణ మొదలు కావడానికి వారం రోజుల ముందు నా దగ్గరకు వచ్చారు. విన్న వెంటనే ఓకే చేశా. 'శివ పాత్ర కోసం నేను మొదట ఎవరి పేరు రాసుకున్నానో, వాళ్ళతో చేస్తుండటం సంతోషంగా ఉంది' అని గౌతమ్ చెప్పారు. 'తినే ప్రతి మెతుకు మీద పేరు రాసి ఉంటుంద'ని అంటుంటారు కదా! ఇదీ అంతే.

'కింగ్‌డమ్‌'కు ముందు 'రామ్ సేతు', త్వరలో రానున్న 'అరేబియా కడలి' చేశారు! మీకు, సముద్రానికి ఏదో సంబంధం ఉన్నట్టుంది!'అరేబియా కడలి' వెబ్ సిరీస్ చేసే సమయంలో గౌతమ్ తిన్ననూరి నాకు ఈ 'కింగ్‌డమ్' కథ చెప్పారు. 'అరేబియా కడలి' సముద్ర నేపత్యంలోనిది. ఈ సినిమాలో సముద్ర తీరంలో దివిలో ఉండే వ్యక్తి పాత్ర. లుక్ పరంగా పెద్ద ఇబ్బందులు రాలేదు. ఓ 20 రోజులు ఈ సినిమా, 20 రోజులు ఆ సిరీస్ చేశా. రెండు రిలీజులు యాదృశ్చికంగా దగ్గరకు కుదిరాయి.

ప్రీ క్లైమాక్స్‌లో మీ యాక్షన్ సన్నివేశానికి మంచి స్పందన లభిస్తోంది.రాజమౌళి గారి సినిమాల్లో ఉన్నట్టు యాక్షన్ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే... దాని వెనుక బలమైన ఎమోషన్ ఉండాలని నేను నమ్ముతా. ప్రీ క్లైమాక్స్‌కు ఆ ఎమోషన్ కుదిరింది. అందుకు అంత మంచి స్పందన లభిస్తోంది.   

సినిమాలో మీకు ఛాలెంజ్ అనిపించిన సీన్?విజయ్ దేవరకొండ నా తమ్ముడు అని తెలిశాక జైల్లో జరిగిన మా ఇద్దరి సంభాషణ. నాకు తమ్ముడంటే మనసులో ఎంతో ప్రేమ ఉన్నా... అది పైకి చూపించకూడదు. ఎందుకంటే... తమ్ముడు 'నీతో ఉండిపోతా' అంటాడు ఏమోననే భయం నాలో ఉంటుంది. తర్వాత తమ్ముడి గురించి తనకు తెలిసిన నిజాన్ని జనాలకు చెప్పలేక తనలో తాను ఇబ్బంది పడే సన్నివేశం కూడా! గౌతమ్ తిన్ననూరి ఆ పాత్రను రాసిన తీరు బావుంది. అందుకే ఇంత మంచి స్పందన. ఫిజికల్‌గా ప్రీ క్లైమాక్స్ సీన్ ఛాలెంజ్ అనిపించింది.

విజయ్ దేవరకొండతో ఫస్ట్ టైమ్ సినిమా చేశారు. ఆయన గురించి?విజయ్ దేవరకొండతో ఈ సినిమా చేయడానికి ముందు నాకు పరిచయం లేదు. ఈ సినిమా కోసం కలిశాక అతనొక మంచి వ్యక్తి అని తెలుసుకున్నా. చాలా తక్కువ సమయంలో మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాలో మా మధ్య అనుబంధం అంత బావుందంటే కారణం విజయ్. షూటింగ్ అయ్యాక విజయ్ దేవరకొండకు మెసేజ్ చేశా... అన్నదమ్ములుగా నటించిన అందరి మధ్య ఇలా ఉంటుందో లేదో? అతనిని ఒక బ్రదర్ కింద ఫీల్ అయ్యా. 

హీరో, విలన్, అన్నయ్య... ఇప్పుడు మీకంటూ ఒక స్పేస్ క్రియేట్ అయ్యింది. ఈ ఫిలింగ్ ఎలా ఉంది?ఇదంత ఈజీగా క్రియేట్ అయిన స్పేస్ కాదు. చాలా సినిమాలు వదులుకుంటే వచ్చింది. కథల ఎంపికలో జాగ్రత్త వహించడం వల్ల కుదిరింది. దీనిని ఒక అడ్వాంటేజ్ కింద కాదు... రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవుతున్నాను.

Also Read: శృతి హాసన్ నుంచి లోకేష్ వరకు ఎవ్వర్నీ వదల్లేదు... కూలీ ఆడియో లాంచ్‌లో రజనీకాంత్ స్పీచ్‌ హైలైట్స్

ఒక వైపు హీరోగా చేస్తూ మరోవైపు ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. కథలపై మీ అప్రోచ్ ఎలా ఉంది?'గాడ్ ఫాదర్' తర్వాత అటువంటి అవకాశాలు వచ్చినా చేయలేదు. సుమారు 10, 15 సినిమాలు వదిలేసుకున్నా. డబ్బుల కోసం అయితే చేయవచ్చు. నేను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు. ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వాలని, నా పాత్రకు మంచి పేరు రావాలని చేస్తున్నా. డబ్బు కోసం అయితే వ్యవసాయం చేసుకుంటా. 

'నో' చెప్పడం ఒక ఆర్ట్ అంటారు. ఎదుటివాళ్లను నొప్పించకుండా ఎలా రిజక్ట్ చేస్తున్నారు?(నవ్వుతే...) నో చెప్పడం ఆర్ట్ అయితే అందులో నేను ఫెయిల్యూర్ స్టూడెంట్. అంత ఈజీగా చెప్పలేను. కానీ ఏదోలా మేనేజ్ చేస్తున్నా. చేయలేనని చెబుతున్నాను.    'కింగ్‌డమ్' తర్వాత విడుదలయ్యే ప్రాజెక్ట్ ఏది? నెక్స్ట్ సినిమాలు?Satyadev Upcoming Movies and Web Series: ఆగస్టు 8న 'అరేబియన్ కడలి' వెబ్ సిరీస్ విడుదల అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అది స్ట్రీమింగ్ అవుతుంది. 'ఫుల్ బాటిల్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో ఒకటి, 'ఆరంభం' ఫేమ్ అజయ్‌ నాగ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Also Readపవన్ లుక్స్‌ కాదు... సుజీత్ హింట్స్... 'ఓజీ' పాట 'ఫైర్ స్ట్రోమ్‌'లో హిడెన్ డీటెయిల్స్... వీటిని గమనించారా?