Sathyaraj About Rajinikanth: సినీ సెలబ్రిటీల మధ్య కోల్డ్ వార్స్ సహజం. కొంతమంది వారి మధ్య ఉన్న గొడవలను ఓపెన్‌గా బయటికి చెప్పేస్తూ ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రం బయట కలిసినా పలకరించుకోకుండా సైలెంట్‌గా ఉండిపోతారు. అదే విధంగా ‘బాహుబలి’ కట్టప్ప అలియాస్ సత్యరాజ్‌కు, సూపర్ స్టార్ రజినీకాంత్‌కు మధ్య కూడా అలాంటి గొడవలే ఉన్నాయని కోలీవుడ్‌లో ఎంతోకాలంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు రజినీకాంత్ సినిమాలో సత్యరాజ్ నటించి 38 ఏళ్లు అయిపోయింది. అయితే ఈ రూమర్స్ నిజమా కాదా అని తాజాగా క్లారిటీ ఇచ్చారు సత్యరాజ్.
రెండు సినిమాలు రిజెక్ట్..
రజినీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో ‘కూలీ’ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సత్యరాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు మూవీ టీమ్ ఇటీవల ప్రకటించింది. అయితే ఇన్నాళ్ల రజినీ సినిమాల్లో తాను ఎందుకు నటించలేదు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు సత్యరాజ్. ‘‘నేను నటుడిగా మారిన తర్వాత నాకు రజినీకాంత్ నటించిన రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి ‘శివాజీ’, ఇంకొకటి ‘ఎంధిరన్’. ‘ఎంధిరన్’లో డ్యానీ డెన్జోన్పా నటించిన ప్రొఫెసర్ బోరా పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ ఆ రెండు సినిమాల్లో రెండు పాత్రలు నాకు నచ్చలేదు. అందుకే రిజెక్ట్ చేశాను. అంతే కానీ మా ఇద్దరి మధ్య ఏం సమస్యలు ఉంటాయి’’ అంటూ రజినీతో మనస్పర్థల విషయంపై క్లారిటీ ఇచ్చారు సత్యరాజ్.
మూవీపై భారీ అంచనాలు..
‘కూలీ’లో తన పాత్ర గురించి చెప్పమనగా సత్యరాజ్.. అప్పుడే ఆ వివరాలను చెప్పడానికి ఇష్టపడలేదు. అంతా తెరపైనే చూడాలని ఇన్‌డైరెక్ట్‌గా సూచించారు. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో రజినీకాంత్ సినిమా అనగానే ‘కూలీ’పై భారీ అంచనాలను పెంచేసుకున్నారు ప్రేక్షకులు. ఇక ఇందులో సత్యరాజ్ లాంటి సీనియర్ నటులు ఉండడంతో లోకేశ్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని భావిస్తున్నారు. ఇక ‘కూలీ’కు సంగీతం అందించడం కోసం అనిరుధ్ రవిచందర్‌ను రంగంలోకి దించారు మేకర్స్. ఈ మూవీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే దీనికి లీగల్ సమస్యలు కూడా ఎదురయ్యాయి.
ఇళయరాజా ఫైర్..
ఇప్పటికే ‘కూలీ’ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యింది. ఇందులో ఇళయరాజా కంపోజ్ చేసిన పాటను ఉపయోగించారు మేకర్స్. అయితే తన అనుమతి లేకుండానే ఈ గ్లింప్స్‌కు తన పాటను జోడించారని చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు మ్యూజిక్ మేస్ట్రో. అంతే కాకుండా ‘కూలీ’ టీమ్‌కు లీగల్‌గా నోటీసులు కూడా పంపారు. ఇదిలా ఉండగా.. ఈ సమస్యలను పట్టించుకోకుండా ‘కూలీ’ షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. జూన్ 10 నుండి ‘కూలీ’ సెట్స్‌పైకి వెళ్లనుందని రజినీకాంత్ స్వయంగా ప్రకటించారు. అందుకే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యేముందు హిమాలయ పర్యటనను కూడా పూర్తి చేసుకున్నారు రజినీ.
Also Read: అమెరికాలో రేడియో షోను హోస్ట్ చేస్తున్న తెలుగు హీరోయిన్ - మొదటి ఇండియన్ నటిగా రికార్డ్