దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమని అన్నారట వెనకటికి ఓ పెద్దాయన! నాటు, మొరటు సామెత అయినా సరే రాయక తప్పలేదు! దీనికి కారణం... వయసు మీద పడిన సెలబ్రిటీలు ఎవరైనా సరే ఆస్పత్రికి వెళితే చాలు, కనీసం ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కూడా కనుక్కోవడం లేదు. ఓ మూడు నాలుగు రోజులకు మరణించారని ప్రచారం మొదలు పెడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణ... శరత్ బాబు
సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. బెంగళూరులో ఉన్న ఆయనకు అనారోగ్యం చేయడంతో హైదరాబాద్ తీసుకువచ్చి ఏఐజీ (Asian Institute Of Gastroenterology Hyderabad)లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. అయితే, అనూహ్యంగా బుధవారం ఆయన చనిపోయారనే ప్రచారం మొదలైంది.
శరత్ బాబును చంపేసిన సెలబ్రిటీలు!
నిజంగా శరత్ బాబు మరణించారని కాసేపు ప్రేక్షకులు సైతం సంతాపం వ్యక్తం చేశారు. అందుకు కారణం... సెలబ్రిటీలే! ''శరత్ బాబు గారి మరణం అత్యంత బాధాకరమైనది'' అంటూ భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) బుధవారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం కూడా ప్రకటించారు.
శరత్ బాబు మరణించలేదని, జీవించి ఉన్నారనే అసలు నిజం తెలుసుకుని ట్వీట్ డిలీట్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. సీనియర్ హీరోయిన్, నటి ఖుష్భు కూడా అంతే! శరత్ బాబు మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కాసేపటికి ఆమె కూడా డిలీట్ చేశారు. ఈ విధంగా చేసిన నెటిజనులు కూడా కొందరు ఉన్నారు.
వ్యూస్ కోసం ఒక సెక్షన్ ఆఫ్ యూట్యూబ్ ఛానళ్లు గతంలో బతికున్న సినిమా స్టార్లు, సెలబ్రిటీలను చంపేశాయి. ఇప్పుడు అరకొర సమాచారం, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లు చూసి, అది నిజమని నమ్మి సెలబ్రిటీలు సైతం ట్వీట్లు చేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు గందరగోళానికి గురి అవుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న సెలబ్రిటీ కుటుంబ సభ్యులు, బంధువులు బాధ పడుతున్నారు. ఏమీ కాలేదంటూ ఖండన ప్రకటనలు ఇస్తున్నారు.
Also Read : డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!
శరత్ బాబు మరణించారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆయన సోదరి స్పందించారు. ''సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పే! అన్నయ్య కొంచెం రికవరీ అయ్యారు. ఆయన్ను రూమ్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకుంటారు. మీడియాతో మాట్లాడుతారని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని పేర్కొన్నారు.
నటుడు శరత్ కుమార్ సైతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ట్వీట్ చేశారు. దయచేసి పుకార్లను, అసత్యాలను ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. శరత్ బాబు త్వరగా కోలుకోవాలని ఆశిద్దామని తెలిపారు. తమిళ నటుడు, దర్శక - నిర్మాత మనోబాల బుధవారం మరణించారు. ఆ బాధలో చిత్రసీమ ఉండగా... శరత్ బాబు వార్త మరింత బాధించింది. తర్వాత ఆయన జీవించి ఉన్నారని తెలుసుకుని అభిమానులు, ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : 'ఏజెంట్' రిజల్ట్ మీద నాగచైతన్య రియాక్షన్ - 'కస్టడీ' డిజప్పాయింట్ చేయదు!