అలేఖ్య హారిక గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. 'దేత్తడి హారిక'గా పాపులర్ అయిన ఈ తెలంగాణా అమ్మాయికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక 'బిగ్ బాస్' తెలుగు సీజన్-4 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత అమ్మడి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. ఈ క్రమంలో 'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ' మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగులో 'వరుడు కావలెను' సహా పలు సినిమాలో చిన్న పాత్రల్లో మెరిసింది. అయితే కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్న ఈ దేత్తడి పిల్ల.. ఇప్పుడు ఉన్నట్టుండి హీరోయిన్ గా టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ అవ్వడానికి రెడీ అయింది. అది కూడా 'బేబీ' లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ మేకర్స్ చేతుల మీదుగా లాంచ్ అవుతుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో రూపొందిన 'బేబీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యను హీరోయిన్ గా పరిచయం చేసిన మేకర్స్.. ఇప్పుడు అలేఖ్య హారికను హీరోయిన్ గా లాంచ్ చేస్తున్నారు. తమ బ్యానర్ లో రానున్న ప్రొడక్షన్ నెం. 4 సినిమాలో హారికను కథానాయికగా తీసుకున్నారు. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయడమే కాదు, పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌ గా ప్రారంభించారు. అలానే ప్రీ లుక్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. 


మాస్ మూవీ మేకర్స్ & అమృత ప్రొడక్షన్స్‌ బ్యానర్స్ పై ఈ సిినిమా తెరకెక్కనుంది. ఎస్‌కెఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సాయి రాజేష్ స్టోరీ - స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు సోమవారం ఉదయం హైదరాబాద్‌ లో జరిగింది. దీనికి యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ముఖ్య అథితిగా హాజరై బెస్ట్ విషెస్ అందజేశారు. క్లాప్ కొట్టి, డైరెక్టర్ చందు మొండేటితో కలిసి స్క్రిప్ట్ అందించారు. యువ హీరో అక్కినేని సుశాంత్, దర్శకులు హరీశ్ శంకర్, వశిష్ట, మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్ వై. రవి శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నాగచైతన్య ట్వీట్ చేస్తూ.. ''సూపర్ టాలెంటెడ్ సంతోష్ శోభన్, హరికా అలేఖ్యలు నటిస్తున్న కొత్త సినిమా యొక్క ఇంట్రెస్టింగ్ ప్రీ-లుక్‌ పోస్టర్ ని లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు. ప్రీ లుక్‌ పోస్టర్ లో సంతోష్, హరిక లిప్ లాక్ చేసుకుంటూ కనిపించారు. 'కొన్ని ప్రేమకథలు జీవితకాలం వెంటాడుతాయి' అనే ఆసక్తికరమైన లైన్ ను బట్టి చూస్తే, ఇది 'బేబీ' తరహాలో రూపొందే హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. విజయ్ బుల్గేనిన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర ప్రధాన నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న అలేఖ్య హారికకు, చాలా కాలంగా సరైన హిట్టు కోసం ట్రై చేసున్న సంతోష్ శోభన్ కు ఎలాంటి ఫలితం అందుతుందో వేచి చూడాలి.






Also Read: జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసి, సినిమాల్లో కోట్లు సంపాదిస్తున్న నటుడు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial