Guttu Chappudu Teaser Is Out Now: టాలీవుడ్‌లో సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మాజీ. తన కుమారుడు సంజయ్ రావును మాత్రం హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరోసారి ‘గుట్టు చప్పుడు’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈ మూవీ టీజర్ కూడా విడుదలయ్యింది. మెగా హీరో సాయి దుర్గాతేజ్ చేతుల మీదుగా ‘గుట్టు చప్పుడు’ టీజర్‌రు విడుదల చేయించారు బ్రహ్మాజీ. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ టీమ్‌తో పాటు బ్రహ్మాజీ కూడా పాల్గొన్నారు.


అన్నీ కలిపిన జోనర్..


డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సంజయ్‌ రావ్‌, ఆయేషా ఖాన్‌ జంటగా నటించిన చిత్రమే ‘గుట్టు చప్పుడు’. ‘హనుమాన్’ చిత్రంతో పాన్‌ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి.. ఈ మూవీకి కూడా సంగీతాన్ని అందించారు. మణీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డా. లివింగ్‌స్టన్‌ నిర్మించారు. రొమాంటిక్‌ మాస్‌ యాక్షన్‌ లవ్‌, ఎంటర్‌టైనర్‌ జోనర్‌లో ‘గుట్టు చప్పుడు’ తెరకెక్కింది. ముందుగా సాయి దుర్గా తేజ్ చేతుల మీదుగా ఈ మూవీ టీజర్ డిజిటల్ లాంచ్ కాగా.. ప్రసాద్ ల్యాబ్స్‌లో బ్రహ్మాజీ నేరుగా టీజర్‌ను విడుదల చేశారు. ఆపై ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి ‘గుట్టు చప్పుడు’ విశేషాలు పంచుకుంది మూవీ టీమ్.



క్లైమాక్స్ కోసమే..


టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్‌ చేస్తున్నారు అంటూ తన స్టైల్‌లో కామెడీ చేశారు బ్రహ్మాజీ. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉందని బయటపెట్టారు. తన అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది అని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని అన్నారు. ‘గుట్టు చప్పుడు’ టీజర్‌ను చూసిన తర్వాత మూవీ హిట్ అవుతుందని నమ్మకం ఏర్పడిందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో తనకు క్యారెక్టర్ ఇవ్వలేదని నవ్వుతూ అన్నారు. క్లైమాక్స్‌ ఫైట్‌ను ముందుగా 15 లక్షలతో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం దాదాపు 75 లక్షల రూపాయలతో జహీరాబాద్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో తీశామని నిర్మాత డా. లివింగ్‌స్టన్‌ బయటపెట్టారు.


లైఫ్ పార్ట్‌నర్‌ను కలిశాను..


‘‘ఇది నాకు 3వ సినిమా. ప్రతి టెక్నీషియన్‌, ఆర్టిస్ట్‌లు 100 శాతం ఔట్‌పుట్‌ ఇచ్చారు. సంగీత దర్శకుడు గౌర హరి నన్ను కలిసి వినిపించిన తొలి ట్యూన్‌తోనే ఆయన్నే పెట్టుకోవాల్సిందే అని దర్శకుడికి రికమెండ్‌ చేశాను. దర్శకుడు మణీంద్రన్‌ నాకు మంచి మిత్రుడు కూడా. అలాగే నిర్మాత లివింగ్‌స్టన్‌ కూడా అంతే. వీరిద్దరి వల్లే నా లైఫ్ పార్ట్‌నర్‌ను కూడా కలిశాను. లింగ్‌స్టన్‌ అనుకున్న దానికంటే బడ్జెట్‌ను భారీగానే పెంచుకుంటూ వస్తున్నారు. ఇది నాకు మంచి టర్నింగ్‌ పాయింట్‌ ఇచ్చే సినిమా. అన్ని వర్గాలను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. టీం అందరికీ సూపర్‌ సక్సెస్‌ ఇచ్చే సినిమా ఇది’’ అని సంజయ్ రావు ‘గుట్టు చప్పుడు’ సక్సెస్‌పై ధీమా వ్యక్తం చేశాడు.



Also Read: మళ్లీ తెరపైకి సాయి పల్లవి పాత వీడియో - ‘రామాయణ్’ను బాయ్‌కాట్ చేస్తామంటూ నెటిజన్స్ ఆగ్రహం