ఏ దర్శకుడికి అయినా తాను తెరకెక్కించే సినిమాపై అభిమానం ఎక్కువగా ఉంటుంది. అందుకే అందరికంటే ఎక్కువగా ఒక సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది దర్శకుడిపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కొందరు డైరెక్టర్స్ విమర్శలను పట్టించుకోరు, మరికొందరు వాటిని సీరియస్‌గా తీసుకుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ విమర్శలపై స్పందిస్తూ.. క్లారిటీ ఇస్తుంటారు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా అలాంటి దర్శకుడే. సందీప్ తెరకెక్కించింది తక్కువ సినిమాలే అయినా.. తన ప్రతీ చిత్రంపై ఎన్నో విమర్శలు, కాంట్రవర్సీలు పుట్టుకొస్తాయి. తాజాగా తను తెరకెక్కించిన ‘యానిమల్’ (Animal Movie) చిత్రంలోని పెల్విస్ అనే డైలాగ్‌పై కూడా విమర్శలు రాగా.. సందీప్ దానిపై క్లారిటీ ఇచ్చాడు.


మహిళా ప్రేక్షకులు ఖండించారు..
‘యానిమల్’ చిత్రంలో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించారు. ఈ సినిమాలో ఒక సందర్భంగా రష్మిక పెల్విస్ పెద్దగా ఉందంటూ రణబీర్ స్టేట్‌మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్‌మెంట్ చాలామందికి నచ్చలేదు. మహిళా ప్రేక్షకుల్లో చాలామంది దానిని ఖండించారు కూడా. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ స్టేట్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. తన దృష్టిలో అది తప్పు కాదని వివరించాడు. అయితే రణబీర్‌కు రష్మికపై ప్రేమ ఉంటే నేరుగానే చెప్పేయవచ్చు కదా.. అలాంటి కామెంట్ చేయడం ఎందుకు అని చాలామంది ప్రేక్షకులు.. సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేయగా.. వారందరికీ సమాధానం ఇవ్వడం కోసం సందీప్.. ఆ సీన్‌ను స్పష్టంగా వివరించాడు.


సీన్‌లో మార్పులు..
‘‘హీరో కొత్త పద్ధతిలో హీరోయిన్‌కు తన ప్రేమను వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే అదే రోజు హీరోయిన్‌కు ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. వాళ్లిద్దరూ ఇప్పటివరకు టచ్‌లో లేరు. అదే ఫోర్స్‌తో వచ్చి ‘‘చూడు గీతాంజలి. నాకు నీ పెల్వీస్ అంటే ఇష్టం’’ అని చెప్తాడు. నేను హీరో క్యారెక్టర్‌కు సంబంధించిన ఆలోచనా విధానాన్ని, టైటిల్‌ను వివరించాలని అనుకున్నాను. కానీ థియేటర్లలో చూసిన ప్రేక్షకులకు ఆ ఆలోచనా విధానం అర్థం కాలేదు. ముందుగా హీరో పువ్వులతో ఆడుకుంటున్నప్పుడు హీరోయిన్ వచ్చినట్టు, ఆ తర్వాత హీరో.. హీరోయిన్ కాళ్లు పట్టుకున్నట్టు మాత్రమే సీన్‌ను రాసుకున్నాను. కానీ హీరో ఏం మాట్లాడకుండా వదిలేస్తే.. హీరోయిన్ వెళ్లిపోతుందని, తిరిగిరాదని తనకు తెలుసు’’ అంటూ ముందుగా అనుకున్న సీన్‌ను మార్చినట్టుగా సందీప్ బయటపెట్టాడు.


అది ప్రశంస అనుకున్నాను..
‘‘నేను నా భవిష్యత్తును నీతో చూస్తున్నానని ఎలా చెప్పాలి? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని హీరో తెలిసేలా చేయాలి. కానీ ఇలాంటి సందర్భాల్లో అబ్బాయిలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారని నేను అనుకున్నాను. ఇంటెన్షన్ ఒకటయితే.. వాళ్లు ఇంకెదో మాట్లాడేస్తారు . అందుకే హీరోకు కూడా ఏం చెప్పాలో తెలియలేదు. ఒక్కసారిగా హీరోకు గీతాంజలితో ఏం చెప్పాలో అర్థం కాక పెద్ద పెల్వీస్ ఉందని అంటాడు. అంటే తను హీరోయిన్‌తో భవిష్యత్తును చూస్తున్నాడని, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనాలనుకుంటున్నాడని అర్థం. నేను అది ప్రశంస అనుకున్నాను. కానీ అది అసభ్యంగా ఉందని మీకు ఎందుకు అనిపించిందో నాకు అర్థం కావడం లేదు’’ అని డైలాగ్ వెనుక తన ఉద్దేశ్యాన్ని వివరించాడు సందీప్.


Also Read: 'యానిమల్'లో ఆ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?