PVR Cinemas Inox gets shock from Prabhas and Prashanth Neel film producers: సాధారణంగా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు షరతులు పెడతాయి. నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదల చేసేందుకు ఒప్పందం చేసుకున్నందుకు 'లియో'ను నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్‌లు రిలీజ్ చేయలేదు. బట్, ఫర్ ఏ ఛేంజ్... వాళ్ళకు 'సలార్' టీం షాక్ ఇచ్చింది. 


నార్త్ ఇండియాలో 'సలార్'కు అన్యాయం చేయాలని చూస్తే... సౌత్ ఇండియాలో సినిమాను ఇచ్చేది లేదని ప్రభాస్ దర్శక నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఖరాఖండీగా చెప్పడంతో పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యానికి భారీ షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


షారుఖ్ ఖాన్ 'డంకీ'కి ఎక్కువ స్క్రీన్లు... 
ప్రభాస్ 'సలార్'కు తక్కువ స్క్రీన్లు ఏంటి?
Salaar Vs Dunki: 'సలార్' ఈ శుక్రవారం (డిసెంబర్ 21న) థియేటర్లలో విడుదలకు రెడీ అయ్యింది. దాని కంటే ఒక్క రోజు ముందు (డిసెంబర్ 21న) బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన 'డంకీ' విడుదల అవుతోంది. నార్త్ ఇండియాలో ఆ సినిమాకు పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ సంస్థలు ప్రయారిటీ ఇస్తున్నాయి. ప్రభాస్ సినిమా కంటే షారుఖ్ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు కేటాయించడానికి రెడీ అయ్యారు. దాంతో ప్రభాస్ నిర్మాతలు వాళ్ళకు షాక్ ఇచ్చేలా ఓ నిర్ణయం తీసుకున్నారు. నార్త్ రాజకీయాలకు దక్షిణాది రాష్ట్రాల్లో చెక్ పెట్టారు. 


Also Read'సలార్' దెబ్బకు బుక్ మై షో క్రాష్ - ఇదీ ప్రభాస్ రేంజ్


Why Salaar tickets are not available in PVR Cinemas and Inox: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'సలార్' బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే... బుక్ మై షో, పేటీఎం వంటి టికెట్ బుకింగ్ యాప్స్ ఓపెన్ చేసి చూడండి! పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లలో ఓపెన్ కాలేదు. ఎందుకు? అంటే... ఉత్తరాది రాష్ట్రాలలో తమ సినిమాకు తక్కువ స్క్రీన్లు ఇస్తామని చెప్పినందుకు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వాళ్ళకు సినిమా ఇవ్వడం మానేశారు. పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యానికి వాళ్ళ స్క్రీన్లలో సినిమా విడుదల చేయబోమని చెప్పేశారు. 


నార్త్ ఇండియాలో షారుఖ్ ఎక్కువ అయితే... 
సౌత్ ఇండియాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇక్కడ!
నార్త్ ఇండియాలో ప్రభాస్ కంటే షారుఖ్ ఖాన్, దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీకి ఫ్యాన్స్ ఎక్కువ. అయితే... ప్రభాస్ మీద విపరీతమైన అభిమానం చూపించే ప్రేక్షకులు కూడా ఉన్నారు. 'సాహో' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీలో ఎక్కువ వసూళ్లు వచ్చాయి.


Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీ ఛార్జ్ - 'సలార్' టికెట్స్ కోసం ప్రేక్షకుల తిప్పలు


ఉత్తరాదిలో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తరహాలో దక్షిణాదిలో షారుఖ్, రాజ్ కుమార్ హిరాణీలకు ఫ్యాన్స్ ఉన్నారా? అంటే కాస్త ఆలోచించి చెప్పాలి. యాక్షన్ ఫిలిమ్స్ కావడంతో 'పఠాన్', 'జవాన్' మన దగ్గర చూశారు. రాజ్ కుమార్ హిరాణీ హ్యూమర్ మాస్ జనాలు చూసింది తక్కువ. నార్త్ ఇండియాలో వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అక్కడ ప్రయారిటీ ఇవ్వాలని భావించిన పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యం సౌత్ ఇండియాలో పెద్ద మార్కెట్ మిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Also Read: ప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే 'సలార్' హిట్?


'సలార్'లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారు. కేరళలో 'బాహుబలి 2' రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'కెజియఫ్'తో ఇండియాలో స్టార్ దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పేరు తెచ్చుకున్నారు. కన్నడలో ఆయన నంబర్ వన్ అని చెప్పవచ్చు. అక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ప్రభాస్ మార్కెట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో 'సలార్'కు పోటీ లేదు. ఆ సినిమా ఏ థియేటర్లలో ఉంటే ఆ థియేటర్లకు ప్రేక్షకులు వెళ్తారు. దీంతో పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ మల్టీప్లెక్స్ చైన్ భారీగా లాస్ కాక తప్పదు.