సమంత హీరోయిన్‌గా నటించిన ‘యశోద’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను నిర్మాతలు విడుదల చేశారు. అడవిలో కుక్కతో సమంత సాహసాలు చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. యశోద సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. 


యశోదలో సమంత హార్డ్ కోర్ యాక్షన్ సీన్స్ చేశారనేది మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది. ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా చేస్తారని ఇంతకు ముందు సమంత చేసిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. అయితే ఈ సినిమా దర్శకులు ఆసక్తికరమైన ఓ విషయం వెల్లడించారు. ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు కన్నీళ్ళు రావడం కోసం నటీనటులు గ్లిజరిన్ వాడతారు. సమంత మాత్రం గ్లిజరిన్ వాడలేదన్నారు. 


సమంతకు రెండు నిమిషాలు చాలు!
సమంత గురించి దర్శకులు హరి, హరీష్ మాట్లాడుతూ ''ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా సరే సమంత రెండు నిమిషాల సమయం అడుగుతారు. సెట్ అంతా సైలెన్స్ అయ్యాక... అలవోకగా నటించేస్తారు. గ్లిజరిన్ కూడా వాడరు'' అని చెప్పారు. సో... 'యశోద'లో మనం చూసే సమంత కన్నీళ్లు రియల్ అన్నమాట. 


యాక్షన్ సీన్స్ విషయంలో కూడా సమంత కాంప్రమైజ్ కాలేదు. డూప్ వాడలేదు. ప్రతి సీన్ సొంతంగా చేశారు. ట్రైనింగ్ తీసుకుని మరీ స్టంట్స్ చేశారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో రాజీ పాత్ర కోసం స్టంట్స్ చేయడంలో సమంత ట్రైనింగ్ తీసుకున్నారు. అయితే... అందులో యాక్షన్, 'యశోద'లో యాక్షన్ డిఫరెంట్‌గా ఉంటుందని ఆవిడ చెప్పారు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే... జ్వరంలో కూడా సమంత యాక్షన్ చేశారు. 


ప్యాకప్ చెప్పాక జ్వరం ఉందని...
సమంత తనకు ఉన్న ఇబ్బందుల గురించి ఎప్పుడూ తమకు చెప్పలేదని దర్శకులు హరి, హరీష్ వివరించారు. ''మేం ఎలా అయితే యాక్టింగ్ ఉండాలని అనుకున్నామో... సమంత అలా నటించేవారు. ఆవిడ ఎప్పుడూ 'నో' చెప్పింది లేదు. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. వాటిని చక్కగా ప్రజెంట్ చేశారు. సీన్ అయిన తర్వాత 'మీకు ఓకేనా? వన్ మోర్ కావాలా?' అని అడిగేవారు. ఒకరోజు స్టంట్ సీన్ చేశాం. సమంత ఫెంటాస్టిక్‌గా చేశారు. సాయంత్రం ప్యాకప్ చెప్పిన తర్వాత ఆవిడకు జ్వరం ఉందని మాకు తెలిసింది. అప్పటి వరకు ఆ విషయం మాకు తెలియనివ్వలేదు'' అని హరి, హరీష్ తెలిపారు. 


సమంతకు మయోసైటిస్ ఉన్న విషయం కూడా 'యశోద' పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ చేసేటప్పుడు తమకు తెలిసిందని హరి, హరీష్ వివరించారు. ఈ సినిమా కథ విని ఆవిడ బాగా ఎగ్జైట్ అయ్యారని... 20 నిమిషాలు విన్నాక ఓకే చేసేశారని తెలిపారు. వరలక్ష్మీ శరత్ కుమార్ అయితే ఇటువంటి ఐడియాలు ఎక్కడ నుంచి వస్తాయని అడిగినట్టు చెప్పుకొచ్చారు.