Samantha Re Entry Into Twitter: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు ప్రముఖ నటి సమంత (Samantha). ఎప్పటికప్పుడు తన ఫోటోలతో పాటు ఎక్కడికైనా టూర్ వెళ్లినా.. ఆ విశేషాలను తన అభిమానులతో ఆమె పంచుకుంటుంటారు. అయితే, ఆమె తాజాగా మళ్లీ 'ఎక్స్'లోకి రీఎంట్రీ ఇచ్చారు.
ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే?
సమంత నిజానికి 2012లోనే తన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. అయితే.. ఏమైందో ఏమో కానీ ఇటీవల అందులో పోస్టులన్నింటినీ ఆమె డిలీట్ చేశారు. ఆ తర్వాత ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్‌ల్లో యాక్టివ్‌గా ఉన్నారు. తాజాగా మళ్లీ 'ఎక్స్'లోకి రీఎంట్రీ ఇచ్చిన సామ్.. సోమవారం తన ఫస్ట్ పోస్ట్ చేశారు.
నటిగా మంచి సక్సెస్ అందుకున్న సమంత.. 2023లో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' అనే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి ఓ సినిమాను సైతం నిర్మించారు. తన నిర్మాణ సంస్థ నుంచి వస్తోన్న ఫస్ట్ మూవీ 'శుభం'కు సంబంధించి ఆమె ఫస్ట్ పోస్ట్ చేశారు. 'పెద్ద కలలతో.. మా చిన్నప్రేమను మీకు అందిస్తున్నాం. ఇది నిజంగా నాకు ఎంతో స్పెషల్. గొప్ప ప్రారంభం. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నా.' అని రాసుకొచ్చారు.
వెల్ కం బ్యాక్ సామ్
ఈ పోస్ట్ చూసి సమంత ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'క్వీన్ ఈజ్ బ్యాక్', 'వెల్‌కమ్ బ్యాక్ సామ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు 'ఎక్స్'లో 10.2 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
Also Read: ఈ వారమే ఓటీటీలోకి రూ.50 కోట్లు సాధించిన 'కోర్ట్' మూవీ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు 'శుభం'
'శుభం' సినిమాకు 'సినిమా బండి' మూవీ ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా హర్షిత్ రెడ్డి, సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హారర్ కామెడీ జానర్‌లో భార్యభర్తల మధ్య సాగే సంఘటనలే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. శోభనం గదిలో వధువు వరునికి టీవీ చూస్తూ ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తిని పెంచుతోంది.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఆమె బిగ్ స్క్రీన్‌పై కనిపించి ఏడాదిన్నర అవుతోంది. చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' మూవీలో నటించారు. ఆ తర్వాత వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'సిటాడెల్: హన్నీబన్నీ' వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం ఆమె 'రక్త్ బ్రహ్మాండ్' యాక్షన్ సిరీస్ కోసం పని చేస్తున్నారు. రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3' వెబ్ సిరీస్‌లోనూ కనిపించనున్నారు. అలాగే.. 'మా ఇంటి బంగారం' అనే సినిమాలోనూ నటిస్తున్నట్లు ప్రకటించగా.. దీని నుంచి ఓ పోస్టర్ మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇతర అప్ డేట్స్ ఏమీ బయటకు రాలేదు.