Mohanlal's Thudaram Release Date Announced: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) ప్రస్తుతం 'L2: ఎంపురాన్' సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ 'తుడరుమ్' (Thudarum) రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నిజానికి ఈ ఏడాది జనవరిలోనే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

ఆ రూమర్లకు చెక్ పెడుతూ..

వాయిదా క్రమంలో సినిమా రిలీజ్‌పై పలు రూమర్లు హల్చల్ చేశాయి. ఈ సినిమా మే వరకూ విడుదల కాదంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేశారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ మోహన్ లాల్ తాజాగా ట్వీట్ చేశారు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. 'మీరంతా ఎన్నో రోజుల నుంచి 'తుడరుమ్' విడుదల విషయంలో రూమర్స్ వింటున్నారు. అవేవీ నిజం కాదు. ఈ సినిమా విడుదల టైం వచ్చేసింది. ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.' అని పేర్కొన్నారు.

ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ సరసన సీనియర్ నటి శోభన (Shobana) నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన మూవీలో మోహన్ లాల్.. ఓ సాధారణ భర్తగా, ట్యాక్సీ డ్రైవర్‌గా మోహన్ లాల్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం.రెంజిత్ నిర్మిస్తున్నారు. 

Also Read: తెలుగులో బాలీవుడ్ హీరోల మూవీస్ వచ్చేస్తున్నాయ్ - ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. ఓటీటీల్లోనూ..

ఎంపురాన్ రికార్డు కలెక్షన్లు

మరోవైపు.. 'L2: ఎంపురాన్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మార్చి 27న విడుదలై ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూళ్లు చేసింది. గతేడాది రిలీజ్ అయిన మంజుమ్మల్ బాయ్స్ రికార్డును అధిగమించింది. అయితే, మూవీ చుట్టూ వివాదాలు నెలకొనగా.. సెన్సార్ బోర్డు సూచనల మేరకు రివైజ్డ్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. బోర్డ్ మొత్తం 24 కట్స్ చెప్పగా.. సినిమా నిడివి 2.8 నిమిషాలు తగ్గింది. 

పృథ్వీరాజ్‌కు నోటీసులు

'ఎంపురాన్' డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌కు తాజాగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 4 చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించినప్పుడు పొందిన ఆదాయానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆయన్ను మెయిల్ ద్వారా కోరింది. ఈ నెల 29లోగా గోల్డ్, జనగణమన, కడువా సినిమాల ఆదాయం వివరాలు తెలపాలన్నారు. దీనిపై ఆయన తల్లి మల్లిక సుకుమారన్ స్పందించారు. ఈ నోటీసులకు తాము భయపడడం లేదని.. ఈ విషయంలో మమ్ముట్టి తమకు సపోర్ట్‌గా నిలిచారని చెప్పారు. తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని.. తాము దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.