సమంత తనకు ఆటో ఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్ ఉందని రెండేళ్ల క్రితం వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె అభిమానులంతా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, ఆమెకు అండగా ఉన్నారు. ఇక అప్పటి నుంచి సమంత తరచుగా హెల్దీ లైఫ్ స్టైల్ గురించి అవగాహన కల్పించడానికి కృషి చేస్తోంది. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె మరోసారి మయోసైటిస్ తర్వాత తన లైఫ్ లో వచ్చిన మార్పుల గురించి వెల్లడించింది. 

కంట్రోల్ మన చేతుల్లోనే... 

సమంత మాట్లాడుతూ "నేను ఒక స్టార్ అయినప్పటికీ, నేనే నా లైఫ్ లో ఒక అనారోగ్య సమస్యను ఎదుర్కొన్న సిచ్యువేషన్ నుంచి వచ్చాను. ఎవరైనా ఏదైనా అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఒంటరిగా, నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. అయితే నా స్టోరీని వెల్లడించడం వల్ల వాళ్లకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. ఎవరైనా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు వాళ్లకు హెల్పింగ్ హ్యాండ్ అవసరమని నేను అర్థం చేసుకున్నాను. హెల్త్ ఇష్యూస్ వచ్చాకే అసలైన సమస్య మొదలవుతుంది. నేను కూడా అనారోగ్యం బారిన పడి కోలుకున్న, దాని నుంచి నేర్చుకున్న ఒక విద్యార్థిని. ఈ లెసన్ తర్వాత ఇతరులు చెప్పే మాటలు కాకుండా, నా లైఫ్ పై నా కంట్రోల్లోనే ఉండాలని అర్థం చేసుకున్నాను. 

ఇక ఈ రోజుల్లో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అన్నది ఒక ఛాలెంజ్. అయితే దానికోసం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. అలాగని చీఫ్ మీల్స్, చీట్ డే వంటివి అక్కర్లేదు. కానీ నేను ఎక్కడైనా కూర్చుంటే చాలు... జనాలు నేను నా హెల్త్ కోసం శాక్రిఫైజ్ చేస్తున్నానని అనుకుంటారు. కానీ నేను నిజంగా అలా చేయట్లేదు. నాకు ఎలా నచ్చుతుందో అలాగే ఉంటాను. నా బాడీని హెల్దీగా ఉంచుకోవడానికి కష్టపడడాన్ని ఇష్టపడతాను. ఇక ప్రస్తుతం నా ఆరోగ్యం విషయంలో వచ్చిన మార్పులు అసాధారణమైనవి. పైగా వాటిని చూసి నేను గర్వపడుతున్నాను. మీ శరీరాన్ని మీరు గౌరవిస్తేనే, అది మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తుంది. మీకు అవసరమైన విధంగా స్పందిస్తుంది. క్రేజీ టార్గెట్స్ ఉండడం అనేది ముఖ్యమే, కానీ మీరు మీ శరీరం చెప్పే మాట కూడా వినాలి" అంటూ హెల్త్ లెసన్స్ చెప్పుకొచ్చింది.  

మెంటల్ హెల్త్ కూడా ముఖ్యమే "శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత నివ్వాలి. ఒకరోజు బ్యాడ్ గా స్టార్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు బోరింగ్ గా అనిపించవచ్చు. కానీ దాన్ని ఎప్పటిలాగే రొటీన్ గా పూర్తి చేస్తే, ఆ చెడును కూడా మర్చిపోతాము. ఇక మనం డయాబెటిస్లో అగ్రగామిగా ఉన్నాము. ఊబకాయంలో మూడో స్థానంలో ఉన్నాము. నిజానికి ఇదసలు మంచి విషయం కాదు. హెల్దీగా ఉండాలంటే ఏదైనా వర్కౌట్ చేయడం లేదా స్పోర్ట్స్ ఆడడం మంచిది. ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యేలా ఏదో ఒకటి చేస్తే మరింత మంచిది. ఎంత ఎక్కువ కదిలితే అంత హెల్దీగా ఉంటాము" అంటూ చెప్పుకొచ్చింది సమంత.