బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలతోనే కాకుండా.. వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయనపై గత 25 ఏళ్లుగా బ్లాక్ బక్ కేసు కొనసాగుతోంది. అయితే తాజాగా సల్లూ భాయ్ కృష్ణ జింకలను వేటాడిన కేసుపై తొలిసారిగా స్పందించారు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, న్యాయమూర్తుల నిర్ణయాన్ని తాను అంగీకరిస్తానని సల్మాన్ చెప్పారు.


1998 సెప్టెంబర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో రెండు కృష్ణ జింకలను వేటాడినట్లు సల్మాన్ ఖాన్ అండ్ టీమ్ పై ఆరోపణలు వచ్చాయి. జోధ్‌ పూర్ సమీపంలోని మథానియాలోని బవాద్ వద్ద చింకారాలను వేటాడినట్లు సల్మాన్‌ పై బిష్ణోయ్ వర్గానికి చెందిన వారు కొందరు ఫిర్యాదు చేశారు. కృష్ణజింకలు తమ ఆధ్యాత్మిక గురువు భగవాన్ జాంబేశ్వరుని పునర్జన్మ అని బిష్ణోయిలు నమ్ముతారు. తాము దైవంగా భావించే కృష్ణజింకలను చంపారని వారు చిత్ర బృందంపై కంప్లెయింట్ చేసారు. సైఫ్ అలీఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలమ్‌ తో సహా పలువురు సినీ స్టార్స్ ను ఇందులో చేర్చారు. 


బిష్ణోయ్ సంఘ సభ్యులు ఫిర్యాదుతో అదే సంవత్సరం సల్మాన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 16 వరకూ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్ కోర్టు సల్మాన్‌ ను దోషిగా నిర్ధారించింది. ఉన్న సల్మాన్ కు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 25 వేల రూపాయల జరిమానాతో పాటుగా, 5 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. సైఫ్, టబు, సోనాలి బింద్రే సహా మిగతా నిందితులను నిర్దోషులుగా పేర్కొంది. 


అయితే కొంతకాలం జైలులో ఉన్న తరువాత సల్మాన్ ఖాన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక 2016 జులై 25న రాజస్థాన్ హైకోర్టు ఈ కేసులో 'దబాంగ్' స్టార్ ని నిర్దోషిగా ప్రకటించింది. కృష్ణ జింకలను వేటాడనే కేసులో అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పుని సవాలు చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఈ కేసు ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్‌ లో ఉంది.


ఈ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ ఓ న్యూస్ పోర్టల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్లాక్ బక్ కేసుపై స్పందించాడు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదని అన్నాడు. మన న్యాయవ్యవస్థ చాలా సమర్థమైనదని.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని సల్మాన్ పేర్కొన్నాడు. మరి కృష్ణ జింకల కేసులో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి. 


ఇదిలా ఉంటే కృష్ణ జింకల వేట నేపథ్యంలోనే గ్యాంగ్‌ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. తాము దైవంగా భావించే జీవాలను చంపి, తమ వర్గం మనోభావాలను సల్మాన్ కించపరిచాడని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. పంజాబ్ లో హత్యకు గురైన సింగర్ సిద్దూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్ కు కూడా పడుతుందంటూ బెదిరింపు లేఖలు కూడా పంపించారు. అంతేకాదు సల్మాన్ ను హత్య చేయడం కోసం రెక్కీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ కు భద్రతను కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ బెదిరింపులు ఆగలేదు. డేట్ చెప్పి మరీ చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు వార్నింగ్ ఇచ్చారు. దీంతో కండల వీరుడు ఫారిన్ నుంచి హై ఎండ్ బుల్లెట్ ఫ్రూఫ్ కారుని ఇంపోర్ట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 


Also Read : గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు!