Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీసెంట్ మూవీస్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆయన రీసెంట్ మూవీ ‘టైగర్ 3’ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రూ. 500 కోట్ల లోపే వసూళ్లు సాధించింది. తాజాగా తన సినిమాలు పెద్దగా రాణించలేకపోవడానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేశారు సల్మాన్. అయితే, ఆయన లాజిక్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.  


టిక్కెట్ల ధరల తగ్గింపే అసలు కారణం!


YRF స్పై యూనివర్స్‌ లో భాగం వచ్చిన ‘టైగర్ 3’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు ఆడలేదు.  అయితే, ఈ సినిమా హిట్ కొట్టకపోవడానికి చిత్రబృందం పలు కారణాలు చెప్పింది. వరల్డ్ కప్, దీపావళి పండగ కారణంగా ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపించలేదని వెల్లడించింది. అయితే,  కంటెంట్  సరిగా లేకపోవడం వల్లే సినిమా సక్సెస్ కాలేదనే ఊహాగానాలు వచ్చాయి. కంటెంట్ బాగుంటే ఈ ఏడాది మేటి సినిమాలు ‘జవాన్’, ‘పఠాన్’ సరసన చేరేదనే టాక్ నడిచింది. కానీ, ఇప్పటి వరకు ‘టైగర్ 3’ రూ. 500 కోట్ల వసూళ్లు కూడా దాటలేదు. సల్మాన్ ఈ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. టిక్కెట్ల రేట్లు తగ్గడం వల్లే తన సినిమాలకు మంచి వసూళ్లు రావడం లేదంటున్నారు. నిజానికి ఆయన చెప్పిన లాజిక్ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ‘టైగర్ 3’ విడుదలైన తొలివారంలో థియేటర్ యాజమాన్యాలు ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వలేదు. అంతేకాదు, చాలా రాష్ట్రాల్లో మల్టీ ఫ్లెక్సులు రెగ్యులర్ రేట్లనే అమలు చేశాయి. సింగిల్ స్క్రీన్ విషయంలో రేట్లు అలాగే ఉన్నాయి. అలాంటప్పుడు సల్మాన్ వాదనలో పస లేదనే టాక్ వినిపిస్తోంది.


సల్మాన్ కు నెటిజన్ల కౌంటర్


పనిలో పనిగా సల్మాన్ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. తన నెక్ట్స్ మూవీ టికెట్ ధరలు పెంచి వసూళ్ల పరంగా మంచి రికార్డులు సాధిస్తామని చెప్పారు. ఈ నిర్ణయంపైనా పలువురు సినీ అభిమానులు కోప్పడుతున్నారు. సినిమా టిక్కెట్ల ధర పెంపు మాట అటుంచి, మంచి దమ్మున్న సినిమాలు చేయాలని సూచిస్తున్నారు. సినిమాలో సత్తా ఉంటే రేట్లు పెంచాల్సిన అవసరం లేదంటున్నారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘పుష్ప’ సినిమాలు అవే టిక్కెట్ ధరలకు కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. అలాంటప్పుడు సల్మాన్ చెప్పే లాజిక్ కామెడీగా ఉందంటున్నారు. ఇక సల్మాన్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం, ఆయనకు ఫ్రస్టేషన్ పెరిగి ఇలా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. ‘పఠాన్’ ‘గదర్ 2’, ‘జవాన్’ లాంటి సినిమాలు కూడా టికెట్ ధరలు పెంచకుండానే కోట్ల రూపాయలు వసూలు చేశాయని విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. ఇప్పటికైన సల్మాన్ సాకులు చెప్పడం మానుకోవాలంటున్నారు. సల్మాన్ ప్రస్తుతం  విష్ణువర్ధన్‌తో కలిసి ‘ద బుల్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.


Read Also: ఆలియా భట్ డీప్‌ఫేక్ వీడియో - ఫస్ట్ పోస్ట్ ఇండోనేషియాలో, వాస్తవాలు ఇవే


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply