బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) మీద జరిగిన దాడి గురించి దేశ ప్రజలు అందరికీ తెలుసు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. వెన్నెముకలో కత్తి దిగడంతో పాటు ఒంటిపై ఆరు చోట్ల బలమైన గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై ప్రజలలో పలు సందేహాలు ఉన్నాయి. సైఫ్ మీద ఎటాక్ జరిగిన టైంలో కరీనా కపూర్ ఎక్కడ ఉంది? కత్తిపోట్ల నుంచి ఐసీయూలో సర్జరీ వరకు... పలు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.
సైఫ్ అలీ ఖాన్ మీద దాడి ఎప్పుడు జరిగింది?
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత... తెల్లవారితే గురువారం వస్తుందనగా... రాత్రి 2:30 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగింది. ముంబైలోని బాంద్రా ఏరియాలో గల ఆయన నివాసం (Satguru Sharan building)లో దాడి జరిగింది.
సైఫ్ అలీ ఖాన్ మీద ఎందుకు దాడి చేశారు?
సైఫ్ అలీ ఖాన్ మీద దాడిని ప్రభుత్వ వైఫల్యంగా మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీ నేతలు వర్ణిస్తున్నారు. కొంతమంది బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందా? అని కూడా అనుమానిస్తున్నారు. అయితే, అటు పోలీసులు - ఇటు సైఫ్ & కరీనా టీం విడుదల చేసిన స్టేట్మెంట్లు చూస్తే... దొంగతనం చేయడానికి ఇంట్లోకి చొరబడిన వ్యక్తి దాడి చేసినట్లు అర్థమవుతోంది.
దొంగతనం చేయడానికి ముందు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో మనుషులు చూడడంతో... ఏమి చేయాలో తెలియక ఆ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్లు పేర్కొంటోంది సైఫ్ ఫ్యామిలీ, ముంబై మీడియా అండ్ పోలీస్.
సైఫ్ అలీ ఖాన్ మీద దాడి ఎలా జరిగింది?
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతుల రెండో కుమారుడు జేహ్ గదిలో ఘటన జరిగింది. జేహ్ బాగోగులు చూసే ఆయాకు ఆ గదిలో ఎవరో అజ్ఞాత వ్యక్తి కనిపించడంలో అలారమ్ మోగించింది. దాంతో తన చిన్న కుమారుడు గదిలోకి సైఫ్ వెళ్ళారు.
సైఫ్ అలీ ఖాన్ ఇంట దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తి... తన ఐడెంటిటీ బయటపడుతుందనే భయంతో పాటు తనను పట్టుకుంటారని అనుమానంతో దాడి చేయడం ప్రారంభించాడని ముంబై వర్గాలు వెల్లడిస్తున్నాయి. దొంగ నుంచి తన పిల్లలు, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం సైఫ్ అడ్డుకున్నారు. విచక్షణారహితంగా సైఫ్ మీద దొంగ దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో జేహ్ ఆయాకు స్వల్పంగా గాయాలు కాగా... సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు.
దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ ఎక్కడ?
సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగిన సమయంలో అతని భార్య, హిందీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినటువంటి కరీనా కపూర్ ఆ ఇంటిలో లేరని ప్రచారం జరుగుతోంది. అటు కరీనా, ఇటు పోలీసులు ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.
సైఫ్ మీద దాడి జరిగిన సమయంలో బాంద్రాలోని అదే ఇంటిలో కరీనా కపూర్ ఉన్నారని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి తన సోదరి కరిష్మా కపూర్, అనిల్ కపూర్ కుమార్తె - నిర్మాత రేహా కపూర్, మరొక హీరోయిన్ సోనమ్ కపూర్ కలిసి ఉన్నప్పటికీ... ఆ తర్వాత కరీనా ఇంటికి చేరుకున్నారట.
ఉదయం 4:30 గంటలకు లీలావతి ఆస్పత్రికి సోదరి కరిష్మాతో కలిసి కరీనా వచ్చారని, తర్వాత భర్తను సర్జరీ చేసే ఐసీయూలోకి తీసుకువెళ్లారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒకరు తెలిపారు.
సైఫ్ అలీ ఖాన్ - కరీనా కుటుంబం క్షేమమేనా?
సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రిలో ఉన్నారని, అయితే ఆయన కుటుంబ సభ్యుల గురించి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పటౌడీ ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి. సైఫ్ మినహా మిగతా కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉన్నారని కరీనా కపూర్ ప్రతినిధి తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఈ సమయంలో ఎటువంటి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
సైఫ్ మీద ఎటాక్ గురించి పోలీసులు ఏమంటున్నారు?
గురువారం ఉదయం సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉంటున్న భారీ భవంతిలో సిసిటీవీ ఫుటేజ్ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. దాడి జరగడానికి రెండు గంటల ముందు బయట వ్యక్తులు ఎవరు ఆ భవంతిలోకి ప్రవేశించినట్టు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడం కోసం ఏర్పాటు చేసిన మెట్ల మార్గం నుంచి గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ ఇంటిలోకి ప్రవేశించాడని చెప్పారు. ఇంటిలో పనిచేసే ఆయా ఆ దొంగను ముందుగా చూసిందని, దొంగతనం చేయడానికి వచ్చిన అతను వాళ్ళ కంట పడటంతో దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు.
సైఫ్ అలీ ఖాన్ కాకుండా ఇంకెవరైనా గాయపడ్డారా?
ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ ఒక్కరే గాయపడ్డారని ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసుల తెలిపారు. ఆయన ఇంటిలో పనిచేసే మహిళ (జేహ్ ఆయా) స్వల్పంగా గాయపడ్డారు. ఆవిడను సైతం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆమెకు చిన్న గాయలు కావడంతో చికిత్స అనంతరం డిశార్జ్ చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా విచారణ నిమిత్తం సదరు మహిళను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Also Read: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
ఇప్పుడు సైఫ్ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్లు ఏమన్నారు?
సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan Surgery News)కు న్యూరో సర్జరీ చేశామని లీలావతి ఆస్పత్రి వైద్యులు వివరించారు. సర్జర్జీకి ముందు, తర్వాత గురువారం రెండు హెల్త్ బులిటెన్లు విడుదల చేశారు. వాటి సారాంశం ఏమిటంటే... సైఫ్ ఒంటి మీద ఆరు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయని తెలిపారు. రెండు గాయలు చాలా లోతుగా అయ్యాయని, వెన్నెముక దగ్గర రక్తస్రావం జరిగిందని, ఒంటిలో ఒక చోట కత్తి దిగిందని, సర్జరీ చేయడం ద్వారా కత్తి ముక్కను బయటకు తీసినట్లు తెలిపారు. సర్జరీ పూర్తి అయ్యాక సైఫ్ ప్రాణాలకు ఎటువంటి ప్రాణపాయం లేదని స్పష్టం చేశారు. సర్జరీ చేశాక ఐసీయూకు షిఫ్ట్ చేశామని, త్వరలో వార్డుకు షిఫ్ట్ చేస్తామని, ఒకటి రెండు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు.
సైఫ్ ఎటాక్ తర్వాత లీలావతి ఆసుపత్రికి ఎవరెవరు వెళ్లారు?
సైఫ్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, కుమార్తె సారా అలీ ఖాన్, సోదరి సోహ అలీ ఖాన్, భార్య కరీనా, కరీనా సోదరి కరిష్మా గురువారం ఉదయం లీలావతి ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు.
రణబీర్ కపూర్ - అలియా భట్ దంపతులు, దర్శకులు సిద్ధార్థ్ ఆనంద్, కునాల్ కోహ్లీ తదితరులు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)ను పరామర్శించడానికి వెళ్లారు.
సైఫ్ అలీ ఖాన్ ఈ ఇంటికి ఎప్పుడు వచ్చారు? అంతకు ముందు...
ప్రస్తుతం ఉంటున్న ఇంటి (సత్గురు శరణ్ బిల్డింగ్స్)కి సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ దంపతులు మూడేళ్ళ క్రితం వచ్చారు. ఇంతకు ముందు ఫార్చ్యూన్ హైట్స్ లో నివాసం ఉండేవారు. సైఫ్, కరీనా దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు (తైమూర్, జేహ్), ఇంకా స్టాఫ్ మెంబర్స్ ఇంటిలో ఉంటారు.