గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన ఈ భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 10న సంక్రాంతి సందర్భంగా రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజ్ కావడానికంటే ముందే చెర్రీ తన 16వ సినిమాను మొదలు పెట్టారు. తాజాగా ఆ మూవీ గురించి... అందులో కీలక పాత్రను పోషిస్తున్న జగ్గూ భాయ్ ఒక క్రేజీ అప్డేట్ ని షేర్ చేశారు.
'RC 16' అప్డేట్ ఇచ్చిన జగ్గూ భాయ్
రీఎంట్రీ తర్వాత జగపతి బాబు ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ మరింత బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విలన్ గా టర్న్ తీసుకున్న తర్వాత జగపతి బాబు బిజీ స్టార్ అయిపోయారు. ప్రతి సినిమాలోనూ ఆయన పాత్ర విభిన్నంగా ఉంటుంది. రీసెంట్ గా 'పుష్ప 2' సినిమాలో జగపతి బాబు గుర్తుపట్టలేని విధంగా సరికొత్త పాత్రలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో తనకు బాగా పని పడింది అంటూ ఓ వీడియోను షేర్ చేశారు జగపతిబాబు. అందులో తన మేకోవర్, పాత్ర రెండూ కొత్తగా ఉంటాయని వెల్లడించారు. తాజాగా షేర్ చేసిన ఈ వీడియోలో తన పాత కోసం జగపతి బాబు మేకప్ వేసుకుంటూ కనిపించారు. ఈ వీడియోకి "చాలా కాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సి 16 కోసం బాగా పని పెట్టాడు. గెటప్ చూసాక నాకు చాలా తృప్తిగా అనిపించింది" అంటూ రాసుకొచ్చారు.
దీంతో ప్రస్తుతం జగపతిబాబు షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'రంగస్థలం' తరువాత మరోసారి రామ్ చరణ్ - జగపతి బాబు కాంబో రిపీట్ అవుతుండడం అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఇప్పుడు జగ్గూ భాయ్ ఇచ్చిన సాలిడ్ అప్డేట్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
దసరా కానుకగా 'RC 16'
RC 16 Release Date: 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 'ఆర్సీ 16' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో 'ఆర్సి 16' అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ మొదలు పెట్టారు. రామ్ చరణ్ కెరియర్ లో ఇది 16వ సినిమా. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే 'ఆర్సి 16' మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంస్థలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మైసూర్ లో ఓ షెడ్యూల్ పూర్తయింది. ఇక 'ఆర్సి 16' మూవీని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా... రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి , ఈ ఏడాది మాసివ్ కలెక్షన్లను రాబట్టిన ఫస్ట్ మూవీగా నిలిచింది.