Soul Of Satya Won Eight International Awards: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలర్స్‌ స్వాతిలు నటించిన సోల్ ఆఫ్‌ సత్య సాంగ్‌ ఇంటర్నేషనల్‌ వేదికపై సత్తా చాటింది. ఒకటి కాదు రెండు ఏకంగా ఎనిమిది అవార్డులు గెలుచుకుని రికార్డు స్రష్టించింది. నవీన్ విజయ్‌ కృష్ణ మ్యూజికల్‌ షార్ట్‌ ఫీచర్ ఫిలింగా 'సత్య' ఈ సాంగ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ పాట గత ఆగస్టు 15న విడుద‌లై విమ‌ర్శకుల ప్ర‌శంస‌లను అందుకుంది. దేశభక్తి ప్రధానంగా వచ్చిన ఈ పాట పలు వేదికలపై ప్రదర్శించబడి అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో మైలురాయిని అందుకుంది. ఇటీవల ఫ్రాన్స్‌లో జ‌రిగిన ‘టౌలౌస్ షార్ట్ ఫెస్ట్ 2024’లో ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ న‌టితో స‌హ మొత్తంగా 8 అవార్డులను గెలిచి స‌రికొత్త రికార్డును నెలకొల్పింది.


‘సత్య’ షార్ట్ ఫిచర్‌ సాంగ్‌ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ ఇండీ పార్ట్ విభాగాల్లో అవార్డులు అందుకోనున్నారు.  ఈ విషయాన్ని తాజాగా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ టీమ్ ప్రకటించింది. సత్య సాంగ్‌ ప్రపంచవేదికగా సత్తా చాటిదంటూ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ టీమ్ ఎక్స్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. దీంతో సత్య సాంగ్‌ టీంకు సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తున్నాయి. దేశం కోసం ప్రాణాల‌ర్పించి స‌రైన గుర్తింపు ద‌క్క‌ని అమ‌ర వీరుల‌కు నివాళిగా ఈ మ్యూజిక్‌ వీడియోను తెర‌కెక్కించారు. ‘అమ్మ ఎప్పుడూ అంటుండేది నేను మహరాణినని.. ఓ రోజు ఒక మహారాజు వచ్చి నన్ను తీసుకెళ్తాడని’.. అంటూ ప్రారంభమయ్యే ఈ పాట చాలా ఎమోషనల్ గా సాగుతూ కంటతడి పెట్టిస్తుంది. 



ఇందులో సాయి ధరమ్‌ తేజ్ ఓ సైనికుడిగా కనిపించారు. ఓ సైనికుడు భారతదేశం కోసం చేసే త్యాగాలను ఇందులో చూపిస్తున్నారు. 'సత్య' ప్రధానమైన ఎమోషన్ కూడా ఇదే. ఇక ఈ మ్యూజికల్ షార్ట్‌లో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి తమదైన ఎమోషన్స్‌ని పలికించారు. మన దేశం కోసం పోరాటం చేసే ఎంతోమంది యోధులకు సంబంధించిన ఓ మంచి సందేశాన్ని తెలియజేయడానికి మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'బలగం' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ మ్యూజికల్ షార్ట్ ఫీచర్ సాంగ్ ని నిర్మించారు. బాలాజీ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ సంపత్ నంది దర్శకత్వంలో ఓ కమర్షియల్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి 'గాంజా శంకర్' అనే మాస్ టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.